పోలింగ్ అయిపోయింది.. ఈవీఎం లు బద్రంగా ఉన్నాయి.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి.. ఇక మిగిలింది అసలు ఓట్ల లెక్కింపు.. ఇంకొన్ని గంటల్లో అదీ మొదలవబోతోంది. ఎపుడా.. ఎపుడా అని ఎదురుచూసిన క్షణాలు దగ్గర పడుతున్నాయి. ఓటు వేశాం కనుక ఎలా వేశామో తెలుస్తుంది. కనీ లెక్కింపు ఎలా చేస్తారో పూర్తిగా తెలీదు. ఇంకా చెప్పాలంటే.. ఆయా పార్టీల కౌంటింగ్ ఏజెంట్లుగా వేల్లెవాల్లకీ సంపూర్తిగా తెలీదు. అందుకే అన్ని పార్టీలు వారికి మొన్నామధ్య ప్రత్యేకంగా శిక్షణ చ్చాయి. మరి ఓటేసి వచ్చిన మనకెవరు చెబుతారు? అసలు ఓట్లను ఎలా లేక్కిస్తారన్న విషయం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా.. అందుకే మీకోసం!
ఎంతో క్లిష్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ప్రతీ అంశమూ చాలా జాగ్రతగా పరిశీలిస్తూ అధికారులు ముందడుగు వేస్తారు. పధ్ధతి ప్రకారం..ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. దాని కన్నా దాదాపు నాలుగు గంటల ముందే అంటే 4గంటలకే హడావుడి ప్రారంభమవుతుంది. సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు అప్పటికల్లా చేరుకోవాలి. సరిగ్గా 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ కేటాయిస్తారు అధికారులు. తరువాత సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని దాని సారాంశం.
ఇక సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అవుతుంది. 8.30 వరకూ ఇది నడుస్తుంది. అయితే, పోస్టల్ ఓట్లు ఎక్కువ వుండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్ లు లేక్కిస్తారని ఒక అంచనా. అదేవిధంగా దాదాపుగా శాసనసభ నియోజకవర్గానికి 2 వేలు, లోక్ సభ నియోజకవర్గానికి 14 వేల వరకూ ఓట్లుంటాయని అంచానా.
ఇక పోస్టల్ బ్యాలెట్ తరువాత సరిగ్గా 8.30 కు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు.. వాటి పరిదిలో పోలైన ఓట్లు ప్రాతిపాదికన్ ఎన్ని రౌండ్ లు అవసరమవుతాయో నిర్ణయిస్తారు. ఒక్కో రౌండ్ కు ౩౦ నిమిషాల సమయం పడుతుంది. 14-15 టేబుళ్ళ పై లెక్కింపు జరుగుతుంది. ఒకసారి మొత్తం టేబుళ్ళ పై ఉన్న ఈవీఎం ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టు. పీవీ స్లిప్పులు ఇలా..ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత పీవీ స్లిప్పుల లెక్కింపు మొదలవుతుంది. ముందుగా దీని కోసం ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యలను చీటీల పై రాసి వాటిని లాటరీ తీస్తారు. ఏఏ పీవీ ప్లాట్ ల స్లిప్పులు లెక్కించాలో లాటరీ ద్వారా నిర్ణయించిన తరువాత వాటి లెక్కింపు మొదలు పెడతారు. ఈ లెక్కింపులో ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఒట్లకూ పీవీప్లాట్ ల స్లిప్ ల ఓట్లకు మధ్య వ్యత్యాసముంటే తిరిగి స్లిప్పులను రెండోసారి లెక్కిస్తారు. ఇలా మూడు సార్లు చేస్తారు. అప్పటికీ తేడా వస్తే స్లిప్పుల లోని లెక్కనే పరిగణనలోకి తీసుకుంటారు. స్థూలంగా ఇదీ లెక్కింపు క్రమం.
ఈవీఎంల లెక్కింపు పూర్తయే సరికే అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసిపోతుంది. కానీ, పీవీ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే దాకా అధికారికంగా ప్రకటించరు. అంటే దాదాపు సాయంత్రం 4 గంటల సమయానికి మెజార్టీ స్థానాల అనధికార సమాచారం వచ్చేస్తుంది. తరువాత పీవీ స్లిప్పుల లెక్క తేలడానికి రాత్రి పదకొండు గంటలు దాటోచ్చని అంచనా.