విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవొచ్చా? తెరిస్తే ఏమవుతుంది?

Flight emergency exit door: విమానం ఆకాశంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరుచుకుంటుందా? ఒకవేళ తెరిస్తే ఏమవుతుంది?

Update: 2025-03-16 09:24 GMT

విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవొచ్చా? తెరిస్తే ఏమవుతుందో తెలుసా?

Full View

ప్లస్ అల్ట్రా 701 విమానం స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ నుండి వెనిజుల రాజధాని క్యరకస్‌కు వెళ్తోంది. రెండు నగరాల మధ్య దూరం 7000 కిమీ. విమానంలో వెళ్లడానికి 9 గంటల 30 నిమిషాలు పడుతుంది. మధ్యలో అట్లాంటిక్ సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. ప్లస్ అల్ట్రా విమానం సముద్రంపై విహరిస్తోంది.

ఇంతలోనే ఒక ప్రయాణికుడు తను కూర్చొన్న సీటులోంచి హడావుడిగా లేచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వద్దకు పరుగెత్తారు. వెళ్లీ వెళ్లడంతోనే క్షణం ఆలస్యం లేకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు డోర్ లివర్ లాగడం మొదలుపెట్టారు. కానీ అది తెరుచుకోవడం లేదు. ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని ఆపడం లేదు. అది చూసి మిగతా ప్రయాణికులు భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టారు.

అంతలోనే విమానంలో ఉండే సిబ్బంది ఏం జరిగిందంటూ అక్కడికి పరుగెత్తుకొచ్చారు. ఆ వ్యక్తిని ఎంత ఆపేందుకు ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. ప్రయాణికుల సాయంతో ఎలాగోలా ఆ వ్యక్తిని నేలకు అదిమి పెట్టి చేతులు వెనక్కు లాగిపెట్టి పట్టుకున్నారు. ఈ పెనుగులాటలో ఒక ఫ్లైట్ అటెండెంట్‌కు గాయాలయ్యాయి. సిబ్బందిలో మరొకరి కాలి మడమ వద్ద ఫ్రాక్చర్ అయింది.

మొత్తానికి ఆయన్ను అతి కష్టం మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుండి దూరంగా తీసుకొచ్చారు. కానీ విమానంలో మిగతా ప్రయాణికులతో పాటు సిబ్బంది అంతా టెన్షన్ టెన్షన్‌తో ఉన్నారు. మళ్లీ ఆ వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తారో అనే టెన్షన్ వారిని భయపెడుతూనే ఉంది. ఫ్లైట్ సెక్యురిటీ ప్రోటోకాల్ ప్రకారం విమానంలో తోటి ప్రయాణికుల నుండి మిగతా వారికి ఎలాంటి హానీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిదే. అందుకే ప్రయాణం చేస్తున్నంతసేపు ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్స్ ఆ వ్యక్తిని అలాగే గట్టిగా పట్టుకుని ఉన్నారు. విమానం క్యారకస్‌లో ల్యాండ్ అవడంతోనే వెనిజుల పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై ప్లస్ అల్ట్రా ఎయిర్ లైన్స్ సంస్థ మీడియా ప్రతినిధి స్పందించారు. ఆ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడానికి ముందు కూడా విమానంలో న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లు తెలిపారు. పక్క సీటులో ఉన్న ప్రయాణికుడితో గొడవ పడటంతో ఆయన్ను మరో సీటుకు మార్చినట్లు చెప్పారు. ఆ తరువాతే ఈ ఘటన జరిగిందని అన్నారు.

ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ విషయానికొస్తే

విమానం ఆకాశంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరుచుకుంటుందా అనే సందేహం చాలామందిని వెంటాడుతుంది. అయితే, వాస్తవానికి అత్యవసర పరిస్థితులతో సంబంధం లేకుండా.. విమానం గాల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడం అనేది ప్రయాణికులతో పాటు సిబ్బంది ప్రాణాలను అపాయంలో పడేయడమే అవుతుంది.

విమానం ఆకాశంలో ఉన్నప్పుడు తెరిస్తే ఏమవుతుంది?

భూమిపై మొత్తం 5 పొరల్లో వాతావరణం ఉంటుంది. అందులో కింది నుండి మొదటి 12 కిమీ ట్రోపోస్పేర్ పొర ఉంటుంది. ఆ తరువాత 50 కిమీ వరకు స్ట్రాటోస్పేర్ ఉంటుంది. సాధారణంగా భూమి నుండి పైకి వెళ్తున్న కొద్దీ గాలి శాతం తగ్గుతుంది. విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు లేదా ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రమే ట్రోపోస్పేర్ వాతారణంలో ప్రయాణిస్తాయి. మిగతా సమయంలో ఎక్కువగా స్ట్రాటోస్పేర్ పొర కింది భాగంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక్కడ గాలి చాలా తక్కువగా ఉంటుంది.

విమానం అంత ఎత్తులో ఉన్నప్పుడు బయటితో పోల్చుకుంటే విమానం బయట గాలి లేకుండా విమానం లోపల చాలా గాలి ఒత్తిడి ఉంటుంది. అలాంటి సమయంలో ఏ కారణం చేతయినా విమానంలోపలి నుండి గాలి బయటికి వెళ్లేలా ఏ చిన్న భాగం తెరుచుకున్నా వెంటనే విమానంలో ఉన్న గాలి బయటికి వెళ్లడం జరుగుతుంది. అలా విమానంలో వాయు ఒత్తిడి తగ్గిపోవడాన్ని డీకంప్రెషన్ అంటారు.

గాలి డీకంప్రెస్ అయ్యే సమయంలో ఎగ్జిట్ డోర్ సమీపంలో ఉన్న వారిని గాలి విమానంలోంచి బయటకు లాగేస్తుంది. అలాగే విమానంలో ఉన్న ఉష్ణోగ్రతలు కూడా పడిపోవడం మొదలవుతుంది. లోపల ఉన్న ప్రయాణికులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. హాలీవుడ్ సినిమాల్లో మీరు ఇలాంటి సీన్స్ చూసే ఉంటారు.

ఒకవేళ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచినప్పుడు విమానం ట్రోపోస్పేర్‌లో తక్కువ ఎత్తులో ఉన్నట్లయితే... అక్కడ విమానం బయట కూడా గాలి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిస్తే, బయటి గాలి ఎంతో వేగంగా లోపలికి వస్తుంది. ఆ గాలి వేగానికి ప్రయాణికులు విమానం లోపలే చివరకు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ తరువాత పరిస్థితులు సిబ్బంది చేయిదాటి పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒక రకంగా బయటి గాలి ఒత్తిడి వల్ల ఆ డోర్ తెరవడం అనేది కూడా అంత ఈజీ విషయమేం కాదు.

ఆధునిక పరిజ్ఞానంతో కొత్తగా తయారవుతున్న విమానాల్లో ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్‌ను ఎవరుపడితే వారు తెరవడానికి వీల్లేకుండా లాకింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. ఆ లాక్ తెరవడం అనేది విమానం సిబ్బంది చేతుల్లోనే ఉంటుంది. ఏ కారణం లేకుండా, సిబ్బంది అనుమతి లేకుండా విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష పడుతుంది.

గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?

2023 మే 26న దక్షిణ కొరియాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. జేజు ఐలాండ్స్ నుండి డేగు నగరానికి వెళ్తున్న ఏషియానా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A321 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం డేగులో ల్యాండ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. రన్‌వే వైపు ప్రయాణిస్తూ 700 అడుగుల ఎత్తులో ఉంది.

ఇంకొన్ని నిమిషాల్లోనే విమానం ల్యాండ్ అవుతుందనగా ఒక ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ట్రై చేశారు. అది పూర్తిగా తెరుచుకోలేదు కానీ కొంత భాగం మాత్రం ఓపెన్ అయింది. ఆ కొంత భాగంలోంచే విమానంలోపలికి దూసుకొచ్చిన గాలితో విమానంలో ఎయిర్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 12 మందికి గాయాలయ్యాయి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడికి కనీసం 10 ఏళ్లు శిక్షపడే అవకాశం ఉందని దక్షిణ కొరియా రవాణా శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News