America vs China: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్‌తో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం... చైనా ప్రతీకారంతో నెక్ట్స్ ఏం జరగనుంది?
America vs China: ఇండియా మీద కూడా ట్రంప్ 26 శాతం సుంకాలు వేశారు. యూరోప్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా ఈ పోరుతో కలవరపడుతున్నాయి.

America vs China: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్‌తో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం... చైనా ప్రతీకారంతో నెక్ట్స్ ఏం జరగనుంది?
America vs China: ఒక యుద్ధం వస్తోంది.. కానీ అది తుపాకులతో కాదు.. బాంబులు పేలే శబ్దాలతో కాదు. ఇది డబ్బుతో నడిచే యుద్ధం. కార్పొరేట్ భవనాలు కాలిపోకపోయినా.. మార్కెట్లు మాత్రం బూడిద అవుతాయి. సైనికులు గాయపడకపోయినా.. దేశాల ఆర్థిక వ్యవస్థలు వణుకుతున్నాయి. ఇది దృశ్యంగా కనిపించదు కానీ.. దాని ప్రకంపనలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. దీన్ని ట్రేడ్ వార్ అంటారు.
ప్రస్తుతం అమెరికా–చైనా మధ్య ఉన్న వాణిజ్య పోరు తీవ్రంగా మారుతోంది. ఒకవైపు అమెరికా సుంకాలను పెడుతుంది.. మరోవైపు చైనా ప్రతీకారంగా కౌంటర్ ట్యారిఫ్‌లతో బదులిస్తోంది. ఇప్పుడు ట్రంప్ డెడ్‌లైన్ ఆట మొదలుపెట్టాడు. చైనా నిర్ణయాన్ని మార్చకపోతే మరో 50 శాతం పన్ను పెడతానని హెచ్చరిస్తున్నాడు. ఈ పోరు చివరికి ఎక్కడ ఆగుతుంది? ఈ రెండు దేశాలు ఇదే తీరులో కొనసాగితే తరువాత ఏమవుతుంది? ఈ ట్రేడ్ వార్ స్టాక్ మార్కెట్లపై ఎలా ప్రభావం చూపుతుంది? ప్రపంచ నాశనానికి ఇవే విత్తనాలా?ఇప్పటికే ఈ యుద్ధం ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది.
ట్రంప్ సుంకాల ప్రకటనల తర్వాత మార్కెట్లు నేలచూస్తున్నాయి. వాల్ స్ట్రీట్ లో పతనాలు బీభత్సంగా మారాయి. ఎస్‌అండ్‌పీ 20 శాతం పడిపోయింది. డౌ జోన్స్ 17 శాతం తగ్గింది. నాస్‌డాక్ గత వారం నుంచే బేర్ మార్కెట్‌లో ఉంది. ట్రేడింగ్ ఫ్లోర్లు భయంతో నిండిపోయాయి. పెట్టుబడిదారులు డాలర్లను వెనక్కి తీసుకుంటున్నారు. చైనాలో కూడా అదే పరిస్థితి. హాంగ్‌సేంగ్ టెక్ ఇండెక్స్ నెలరోజుల్లోనే 27 శాతం పడిపోయింది. యువాన్ విలువ పడిపోయింది.
బాండ్స్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ ఎకానమీ సంక్షోభ దిశగా వెళ్తోంది. అమెరికా-చైనా ఒకరిపై ఒకరు దెబ్బలతో పోటీ పడుతుంటే.. ప్రపంచ మార్కెట్లు ఈ మధ్యలో పిసికి పోతున్నాయి.ఇక మరోవైపు చైనా కూడా వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేదు. మాటలతో కాదు.. మినరల్స్‌తో అమెరికాకు బుద్ధి చెబుతామని ధృఢంగా నిర్ణయించుకుంది. ప్రపంచానికి అత్యవసరమైన కొన్ని అరుదైన మినరల్స్‌పై ఎగుమతి ఆంక్షలు విధించింది. ఇవి మిసైళ్ల నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు నుంచి శాటిలైట్లు వరకు అన్ని ఆధునిక సాంకేతిక వస్తువుల్లో ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఇవి ఎక్కువగా చైనా నుంచే అందుతాయి.
ఇప్పుడు అవి బంద్. అమెరికన్ టెక్ కంపెనీలు ఒక్కసారిగా తూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు దద్దరిల్లిపోతున్నాయి. ఒకవైపు ట్రంప్ ట్యారిఫ్‌తో దాడి చేస్తుంటే.. మరోవైపు చైనా మినరల్ దెబ్బతో అమెరికా టెక్ శక్తిని వీక్ చేస్తోంది. ఇది ఇక ట్రేడ్ వార్ కాదు.. ఇది శాంతంగా కనిపించే, కానీ లోపలే లోపల శక్తివంతంగా నడిచే స్ట్రాటజిక్ వార్.ఇక ప్రపంచంలోని ఇతర దేశాలు ఈ పోరును నిశ్శబ్దంగా చూస్తున్నాయి. కానీ ఆ నిశ్శబ్దంలో అసలు భయం ఉంది.
అమెరికా తూటాలేలా అనిపించే ఈ సుంకాలు వాస్తవానికి చైనాను మాత్రమే కాదు.. భారత్ వంటి దేశాలనూ ఢీకొడుతున్నాయి. ఇండియా మీద కూడా ట్రంప్ 26 శాతం సుంకాలు వేశారు. యూరోప్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా ఈ పోరుతో కలవరపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య ఒప్పందాలే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మార్కెట్ల ఊగిసలాటను చూస్తే అసలు సమస్య ఏంటో అర్థమవుతోంది.దిగుబడి చూడగానే ఇది కేవలం అమెరికా-చైనా మధ్య పరిమితమైన యుద్ధం అనిపించొచ్చు. కానీ అసలు నష్టాన్ని చూసేది సామాన్యుడే.
సుంకాలు, దిగుమతులపై భారీ పన్నులు, నిషేధాలు మొదట కంపెనీలను ఇబ్బంది పెడతాయనిపిస్తుంది. కానీ వారు ఆ భారం వినియోగదారులపైకి నెట్టేస్తున్నారు. అమెరికాలో టెక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. చైనాలో దిగుమతి వస్తువుల ఖర్చు పెరిగి మధ్యతరగతి కుటుంబాలు కకావికలవుతున్నాయి.
భారత్‌లో అమెరికా నుంచే వచ్చే మెడికల్ ఎక్విప్‌మెంట్, మిషనరీ, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగిపోయాయి. అంటే ఈ వాణిజ్య యుద్ధం మిమ్మల్ని చేరిన కిచెన్ దాకా వచ్చేసింది. ఉద్యోగాలు కల్పించాల్సిన కంపెనీలు ఖర్చులు తగ్గించేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ట్రేడ్ వార్ ఎక్కువ కాలం సాగితే.. చివరికి నష్టపోయేది సామాన్యుడే.