మరోసారి ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో రష్యాకు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అప్పటికే ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దాంతో అందులో ఉన్న సిబ్బందితోపాటు 73 మంది ప్రయాణికుల్లో 41 మరణించగా పలువురు గాయపడ్డారు. విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగడానికి పిడుగుపడటమే కారణమని రష్యాకు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. దట్టమైన నల్లని పొగతో, నిప్పులు చిమ్ముకుంటూ నింగి నుంచి దూసుకువచ్చిన విమానం రన్‌వేపై వెళ్తున్న దృశ్యాలు.. విమానం ఆగాక అందులోని ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి కిందికి జారి, ప్రాణాలు అరచేత పెట్టుకుని అక్కణ్నుంచీ పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.