యూరప్‌లో కరోనా కల్లోలం.. గత వారంలోనే 11శాతం పెరిగిన కేసులు

Coronavirus: కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తోంది.

Update: 2021-11-25 03:03 GMT
Representational Image

Coronavirus: కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఒక్క యూరప్‌లో మాత్రమే కరోనా కల్లోలం సృష్టి్స్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలోనే 11 శాతం కేసులు పెరిగినట్టు వెల్లడించింది. అక్టోబర్ మధ్య కాలం నుంచి కేసులు పెరుగుదల కొనసాగుతోందని తెలిపింది. తక్షణ చర్యలు తీసుకోకపోతే మరో 7లక్షల దాకా మరణాలు సంభవించే అవకాశం ఉందని WHO యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ లుగే హెచ్చరించారు.

యూరప్ ప్రాంతం ఇంకా కొవిడ్ కబంధహస్తాల్లోనే ఉందని WHO హెచ్చరించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, మరణాలు 6శాతానికి పైగా పెరిగినట్టు వెల్లడించింది. గత వారంలో 3.6 మిలియన్ల పాజిటివ్‌ కేసులు రాగా 5,100 మంది మృతిచెందినట్టు తెలిపింది. దేశాలన్నీ వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచడంతో పాటు కొవిడ్‌ నియంత్రణ నిబంధనలు పాటించాలని WHO సూచించింది. మొత్తం యూరోపియన్‌ ప్రాంతంలో 1బిలియన్‌‌కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.

గత వారంలో ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, బెల్జియం దేశాలు కొవిడ్‌ నియంత్రణకు పాక్షిక లాక్‌డౌన్‌ సహా పలు కఠిన చర్యలు తీసుకున్నట్టు WHO వెల్లడించింది. జర్మనీలో మరణాలు లక్ష మార్కును దాటగా.. అదే సమయంలో ఆగ్నేయాసియాలో 11శాతం, మధ్య తూర్పు దేశాల్లో 9శాతం తగ్గుదల నమోదయ్యాయి. ఆఫ్రికాలో భారీ స్థాయిలో కొవిడ్‌ మరణాలు తగ్గాయని, అమెరికాలో కేసులు స్థిరంగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం 19శాతానికి పైగా పెరిగినట్టు వెల్లడించింది.

Tags:    

Similar News