వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. పార్టీ దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల మీదే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. కాగా ప్రస్తుత రాజకీయాలు, నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన పరిణామాలను బేరీజు వేసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఇదే క్రమంలో 2024 ఎన్నికలు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకు తీసుకోవలసిన అన్ని చర్యలపై దృష్టి సారించింది. ఇదిలావుంటే తెలంగాణలో పోటీ చేయడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన చేయడంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొంది.