ఉపఎన్నికలకు టీడీపీ అభ్యర్థులు వీరే?

Update: 2018-05-28 05:55 GMT

ఏపీలో మరోసారి ఉపఎన్నికలు రాబోతున్నాయా..? వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందనున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీటిపై సదరు ఎంపీలతో చర్చించేందుకు ఈనెల 29 న ఢిల్లీకి రావాలని స్పీకర్ కార్యాలయం ఆదేశించింది. దీంతో అధికార పక్షం టీడీపీ అప్రమత్తమైంది. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొంది ఉపఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో ఒక దఫా చర్చలు జరిపారు. మెజారిటీ సభ్యులు ఉపఎన్నికల్లో పోటీ చెయ్యాలని సూచించారు. ఈ క్రమంలో టీడీపీలో ఆశావహుల జాభితా చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. కడప , తిరుపతి , రాజంపేట, ఒంగోలు , నెల్లూరు స్థానాలకు ఉపఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో  కడప పార్లమెంటు నుంచి మాజీ మంత్రి పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి లేదా మంత్రి ఆదినారాయణరెడ్డి ఎవరో ఒకరిని  బరిలోకి దింపే అవకాశముంది.వీరు కానీ పక్షంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్ . శ్రీనివాసులు రెడ్డికి టికెట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అదే జిల్లా రాజంపేట స్థానానికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి లేదా అయన కుమారుడు పోటీ చేసే అవకాశముంది. చిత్తూరు జిల్లా విషయానికొస్తే తిరుపతి పార్లమెంట్ స్థానికి ఉపఎన్నిక జరిగే అవకాశమున్నందున టీడీపీనుంచి గతంలో(2009) పోటీచేసిన వర్ల రామయ్యను ఆ పార్టీ అభ్యర్థిగా  ఎంపిక దాదాపు ఖరారైంది. కాగా ఒంగోలు , నెల్లూరు స్థానాల్లో ఒంగోలుకు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఎమ్మెల్సీ  కరణం బలరాం పోటీ చేసే అవకాశముంది. సింహభాగం అధిష్టానం శ్రీనివాసులు రెడ్డిపైనే ఆసక్తి చూపిస్తోంది. నెల్లూరు నుంచి ప్రస్తుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేదా ఆనం కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పోటీచేయించాలని టీడీపీ  భావిస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి పోటీకి అంతగా ఆసక్తి చూపడం లేదు పైగా జిల్లా మంత్రులైన పి. నారాయణ లేదా సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి లలో ఎవరో ఒకరో బరిలో నిలబడాలని ఆయన సూచిస్తున్నారు.  

Similar News