లక్నో పాస్‌పోర్ట్ కార్యాలయంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు చేదు అనుభవం ఎదురయింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కలగజేసుకోవడంతో కథ సుఖాంతం అయింది. దురుసుగా ప్రవర్తించిన పాస్‌పోర్ట్ అధికారిపై బదిలీ వేటు పడింది.
మహ్మద్ సిద్ధిఖీ, తన్వీసేత్ అనే దంపతులు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లక్నోలో పాస్‌పోర్ట్ కార్యాలయంలో వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. రెండు కౌంటర్లలలో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న జంటకు మూడో కౌంటర్‌లో ఇబ్బంది తలెత్తింది. వెరిఫికేషన్ అధికారి తన్వీసేత్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి పేరు మార్చుకుని రావాలని అప్పుడు పాస్‌పోర్ట్ ఇవ్వడం సాధ్యపడుతుందని స్పష్టం చేశాడు. లేకపోతే మతం మార్చుకుని రావాలని సలహా ఇచ్చాడు. ఓ ముస్లింని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని తన్వీసేత్‌పై బిగ్గరగా అరిచాడు.
వెరిఫికేషన్ అధికారి తీరుతో షాక్ తిన్న తన్వీసేత్ అక్కడ నుంచి బయటపడింది. తనకు జరిగిన అవమానాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియజేయాలని భావించింది. వరుస ట్వీట్లతో మంత్రికి విషయం తెలియజేసింది. వెరిఫికేషన్ అధికారి ఏ విధంగా దురుసుగా ప్రవర్తించాడో వివరించింది. తన్వీసేత్ చేసిన ట్వీట్ విదేశాంగ అధికారులను కదిలించింది. వెంటనే రంగంలో దిగిన అధికారులు లక్నో కార్యాలయ ఉన్నతాధికారులను సంప్రదించారు. తన్వీసేత్ దంపతులకు పాస్‌పోర్టులు ఇప్పించారు. వెరిఫికేషన్ అధికారిని బదిలీ చేశారు.
పాస్‌పోర్టులు లభ్యం కావడంతో తన్వీసేత్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు జరిగిన అవమానాన్ని వివరించారు. ఉన్నతాధికారులు కల్పించుకోవడంతో తమ సమస్య ఎలా పరిష్కారం అయిందో మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమస్య తలెత్తగానే వెంటనే స్పందించిన సుష్మాస్వరాజ్ తన్వీ దంపతులకు పాస్‌పోర్ట్ లభించడంతో కీలకంగా వ్యవహరించారు. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయకముందే సమస్యను పరిష్కరించారు. వివాదం ముదరకుండా వ్యవహరించి సమస్యకు ముగింపు పలకారు.