ముగింపు దశకు వచ్చిన వైసీపీ ఎంపీల రాజీనామాల అంశం...మళ్లీ గెలుస్తామని వైసీపీ ఎంపీల ధీమా
వైసీపీ ఎంపీల రాజీనామాల అంశం ముగింపు దశకు వచ్చేసింది. స్పీకర్ విదేశీ పర్యటన ముగించుకుని భారత్ తిరిగి రావడంతో ఇక రాజీనామాల ఆమోదం లాంఛనమే అంటున్నారు పార్టీ శ్రేణులు. కొంత కాలంగా నానుతూ వచ్చిన ఈ వ్యవహారం ఎట్టకేలకు చివరి దశకు వచ్చినట్లే కనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చారు. దీంతో వైసీపీ ఎంపీలు మళ్లీ తమ రాజీనామాలు ఆమోదించుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాజీనామాల పని పూర్తి కాగానే ఉప ఎన్నికలకు షెడ్యూలు ప్రకటిస్తారని, మరో రెండు లోక్‌సభ స్థానాలతోపాటు తమ స్థానాలకూ ఎన్నికలు జరుగుతాయని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారు.
స్పీకర్ వచ్చినా రాజీనామాలు ఆమోదించరని, ఒకవేళ ఆమోదించినా ఉప ఎన్నికలు రావని, ఇదంతా పెద్ద నాటకమని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందులో ఎవరి ఆశలు నిజమవుతాయో చెప్పలేం. తాము రాజీనామా చేయగానే ఉప ఎన్నికలు వస్తాయని, అన్ని స్థానాలు మళ్లీ గెలుస్తామని ధీమాగా ఉన్నారు. అలా జరిగితే ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు అంగీకరించినట్లవుతుందని, ఈ ఫలితం సాధారణ ఎన్నికల్లోనూ కనబడి వైసీపీకి ఘన విజయం లభిస్తుందని ఎంపీలు భావిస్తున్నారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు బాబు అవినీతిని పజల్లోకి తీసుకువెళుతూనే మరోవైపు పుస్తక రూపంలో తీసుకువచ్చి ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్పీకర్ తమ రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు జరగకపోతే ప్రత్యేక హోదా కోసం పదవులను తృణప్రాయంగా త్యాగం చేసిన ఎంపీలుగా చరిత్రలో నిలిచిపోతామని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తాము పదవులకు రాజీనామా చేసి చిత్తశుద్ధి చాటుకున్నామని, టీడీపీ ఎంపీలు పదవులను పట్టుకొని వేలాడుతున్నారని ప్రచారం చేసుకోడానికి వారు సమాయత్తం అవుతున్నారు.