అసెంబ్లీని రద్దుచేసిన రోజే తెరాస పార్టీ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం మొదలుపెట్టారు. అయితే టిక్కెట్ ఆశించి భంగపడ్డవారు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. నాలుగేళ్లుగా తనను వేధిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు జగదీశ్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని, ఆయనకు టికెటిస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. గత ఎన్నికల్లో తాను 47 వేల ఓట్లు సాధించానని, ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి తెలిపారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ న్యాయం చేస్తారన్న నమ్మకం తనకుందని, హుజూర్‌నగర్ టికెట్ మాత్రమే తనకు కేటాయించాలని కోరారు. అలాగే మంత్రి కేటీఆర్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని శంకరమ్మ స్పష్టం చేసింది.