ప్రధాని మోదీ కార్పొరేట్లకు మాత్రమే న్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా భైంసా లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయన ప్రసంగించారు. రాఫెల్ స్కాం ద్వారా తన మిత్రుడు అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్లు కట్టబెట్టారని అన్నారు. దేశ ప్రజలను మోదీ నడిరోడ్డుపై నిలబెట్టారని అన్నారు. యూపీయే హయాంలో పేద ప్రజల కోసం తాము ఎంతో చేశామని చెప్పారు. దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన మోదీ... ఎవరికి కాపలా ఉన్నారని ప్రశ్నించారు. అంబానీలు, అదానీల వంటి 15 మంది కార్పొరేట్లకు ఆయన కాపలాదారుడిగా ఉన్నారని అన్నారు. దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోదీ... దొంగలా మారారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మోదీ, కేసీఆర్ ల పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... ఏక కాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.. రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు ఇచ్చారా? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు, కట్టించారా? ముస్లింలకు 12 శాతం రిజర్వేష్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇంటింటికి నల్లా వచ్చిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనని, జనం సమస్యలతో రాజకీయం చేయాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.