ఏళ్లు గడిచినా.. తరాలు మారినా.. ఇంకా ఆ యుగపురుషుడు మన మధ్యే ఉన్నాడు. తెలుగుజాతి గుండెల్లో మెదులుతున్న మెమరీ పేరే ఎన్టీఆర్. క్రమశిక్షణకు పర్యాయపదం. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక. ఇలా.. అన్నీ కలిపితే వాటికొచ్చే ఆన్సరే.. నందమూరి తారక రామారావు. ఇవాళ ఆ యుగపురుషుడి 96వ జయంతి.
రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు.. పాత్ర ఏదైనా పర్సన్ ఒక్కరే. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా.. అన్ని పాత్రల్లో నటించి, జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రాముడు. నటుడిగా.. అంతకుమించిన నాయకుడిగా తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు ఎన్టీఆర్.
నందమూరి తారకరామారావు... సింపుల్‌గా ఎన్టీఆర్. ఆ పేరులో మ్యాజిక్ ఉంది. ఆయనలో మేటర్ ఉంది. నటుడిగా మెస్మరైజ్ చేశారు. నాయకుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు. అన్నగారన్న పదం ఆయన కోసమే పుట్టిందన్నట్లుగా.. చరిత్రలో నిలిచారు ఎన్టీఆర్. తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో మైలురాళ్లకు ఎన్టీఆరే ఆద్యుడు. ఇక ఆయన నటజీవితంలో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలు నేటీకి.. జనం మదిని గెలుస్తూనే ఉన్నాయి. సాంఘికమైనా, పౌరాణికమైనా, చారిత్రకమైనా, జానపదమైనా.. ఏదైనా సరే నందమూరి బాణీ వాటికే వన్నె తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నిమ్మకూరులో మే 28, 1923న నందమూరి తారక రామారావు జన్మించారు. సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా చేస్తోన్న ఎన్‌టిఆర్.. చెన్నై ట్రైన్ ఎక్కేశారు. తొలి అవకాశం పల్లెటూరి పిల్ల సినిమాకు వచ్చినా విడుదలైంది మాత్రం మనదేశం చిత్రం. షావుకారు సినిమా తరువాత తన నివాసాన్ని చెన్నై థౌజండ్ లైట్స్ ప్రాంతానికి మార్చుకున్నారు రామారావు. విజయావారి బ్యానర్‌పై వచ్చిన పాతాళబైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్టీఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి.
1956లో విడుదలైన మాయాబజార్‌లో ఎన్టీఆర్ తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్. 1959లో విడుదలైన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వవిఖ్యాత ఎన్.టి.రామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు ఎన్టీఆర్ 400 చిత్రాలలో నటించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన.. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా కొన్ని చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు ఎన్టీఆర్.