తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీని ఢికొనడానికి అన్ని పక్షాలు ఏకం కావాలని డిసైడయ్యాయి. అందుకు కలిసి వచ్చే పార్టీలను కాంగ్రేస్ కలుపుకుపోవడానికి కూటమి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. టిఆర్ఎస్, బిజేపి మినహా అన్ని పార్టీలను కూటమిలోకి రావాలని ఆహ్వనించింది హస్తం పార్టీ. అయితే మొదటి నుంచి కూటమిలో టిడిపి, టిజేఎస్, సిపిఐలు ఉన్నా.. సీట్లపై స్పష్టత రాకపోవడంతో టిజేఎస్ మాత్రం కూటమి చర్చలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా గోల్కొండ హోటల్ లో జరిగిన చర్చలకు కోదండరాం హాజరుకావడంతో.. మహాకూటమిలో వచ్చిన విభేదాలు సద్దుమణిగినట్టేననే వాదనలు వినిపిస్తున్నాయి.
ముందు సీట్ల అంశం చర్చకు రాకుండా, కేవలం ఉమ్మడి మ్యానిఫెస్టో గురించి చర్చించాలని మహాకూటమి నిర్ణయించింది. ముందు సీట్లు సర్దుబాటు అంశాన్ని తెరపైకి తెస్తే, అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో వ్యూహాత్మకంగా, కూటమిలో అన్ని పార్టీలతో కోదండరాం ప్రతిపాదించిన ఉమ్మడి మ్యానిఫేస్టో పై చర్చలు ప్రాంరభించింది. ఇక టిజేఎస్ ప్రతిపాదించిన కూటమి చైర్మెన్ పదవిపై కూడ.. పార్టీలు అంగీకరించేలా లేకపోవడంతో... టిజేఎస్, కూటమిలో ఎలా ముందుకు ఎలా సాగుతుందనే చర్చ అన్ని పార్టీలో జరుగుతోంది. ఇక సీట్లు విషయంలో కాంగ్రేస్ మెట్టుదిగేలా లేకపోవడంతో.. టిజేఎస్ పార్టీనే సర్దుకుపోయే పరిస్థితి నెలకొనట్టు కనిపిస్తోంది. చివరకు కాంగ్రేస్ చెప్పిన సీట్లునే, టిజేఎస్ తీసుకునే పరిస్థితిని తీసుకువచ్చేందుకు కాంగ్రేస్, టిడిపిలు వ్యూహరచన చేస్తున్నాయి.
ప్రసుత్తం కూటమి ఎజెండాపై చర్చలు కొనసాగించి.. షెడ్యూల్ వచ్చే నాటికి కోదండరాంతో సీట్ల సర్దుబాటు అంశం తెరపైకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. టిజేఎస్ సీట్ల విషయంలో వెనక్కి తగ్గకపోతే, చివరికి వదిలేయానే యోచనలో కూడా ఉన్నట్లు టిజేఎస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు, కోదండ వ్యూహం.. మరోవైపు, కాంగ్రెస్, టీడీపీల ప్రతివ్యూహం.. చివరికి వీరిలో ఎవరి పంతం నెగ్గుతుందో త్వరలోనే తేలనుంది.