హైదరాబాద్ లో కుండపోత వర్షానికి కారణం ఇదే..

Update: 2018-10-18 02:04 GMT

క్యుములోనింబస్‌ మేఘాల గర్జణతో హైదరాబాద్‌ తడిసి ముద్దయింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండ పోత వర్షానికి జనజీవనం స్తంభించింది. ఆసిఫ్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ముషీరాబాద్‌, కూకట్ పల్లి, చార్మినార్,  విరాట్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పలు కాలనీలు, బస్తీల్లో ఇళ్ల ముందు పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్‌ తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి 5.30 గంటల మధ్య భారీ వర్షం కురియడంతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగిన కారణంగా భూవాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో బుధవారం ఒక్కసారిగా అండమాన్‌ నికోబార్, తూర్పు దిశ నుంచి వీస్తున్న తేమగాలులు నగరాన్ని తాకడంతో అకస్మాత్తుగా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి కుండపోత కురిసిందని వాతావరణ శాఖ చెబుతోంది. 

Similar News