పాతబస్తీకి చెందిన ఓ మహిళ 14 ఏళ్లకిందట బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ ఆమెకు పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. తాను భారతీయుడినేనని, ఢిల్లీ తన స్వస్థలం అని నమ్మించి సదరు మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకు అతడు పెట్టె చిత్రహింసలు భరించలేక ఆమె హైదరాబాద్ వచ్చేసింది. 2011లో ఉస్మాన్ సైతం హైదరాబాద్‌కు వచ్చాడు. వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చిన అతను అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అట్నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు.
ఈ క్రమంలో పాతబస్తీలో ఆమె నివాసం ఉంటున్న ఇంటికి వచ్చి వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీసి కొందరికి ఆన్‌లైన్‌లో పెట్టాడు.తనకు డబ్బు ఇవ్వకపోతే ఆమె ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించాడు. దాంతో అతడి వేధింపులు తాళలేక బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులకు అతగాడిని పాకిస్థానీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతనెలలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.