ఐపీఎల్ లో ఆటగాళ్ల కొనుగోలు వ్యవహారంపై.. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఆవేదన చెందాడు. తను మోసపోయానని చెప్పి బాధపడ్డాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు క్రిస్ గేల్.. ఏడు సీజన్ల పాటు ఆడాడు. ఈ ఏడాది కూడా.. బెంగళూరు తరఫున ఆడతానని అనుకున్నాడు. అలాగే.. అతడిని జట్టులోకి తీసుకుంటామని కూడా బెంగళూరు యాజమన్యం హామీ ఇచ్చిందట. కానీ.. చివరికి ఫైనల్ వేలంలో కూడా తనను తీసుకోకుండా మొహం చాటేసిందట.
ఈ విషయాన్ని మీడియాతో చెబుతూ.. గేల్ ఆవేదనకు గురయ్యాడు. “అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం కాలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు.. చాలా బాధ పడ్డా” అంటూ.. తన బాధను పంచుకున్నాడు. జీవితం అంటే ఇదేనేమో అని కూడా వేదాంతం మాట్లాడాడు. తను అబద్ధం చెప్పినా.. తన రికార్డులు అబద్ధం చెప్పవంటున్న గేల్.. తాను ఫామ్ లోనే ఉన్నానని గుర్తు చేశాడు.
అయితే.. బెంగళూరు లేకపోతేనేం.. పంజాబ్ ఉందిగా అని కూడా చెప్పాడు.. గేల్. తనను రెండు కోట్ల కనీస ధరకు వేలంలో దక్కించుకున్న పంజాబ్ జట్టు కోసం.. పోరాడతానని గేల్ అన్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ విజయం కోసం, వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ లో వెస్టిండీస్ విజయం కోసం క్రికెట్ కొనసాగిస్తానని చెప్పాడు. గేల్ ఆవేదనపై.. అతని అభిమానులు కూడా బాధ పడుతున్నా.. ఆయన లక్ష్యం నెరవేరాలంటూ ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నారు.