నోట్ల రద్దుకు అనేక కారణాలు చెబుతోంది బీజేపీ. ఈ వ్యవహారం ఆ పార్టీకి వరంగా మారిందని ప్రతి పక్షాలు సైతం బలంగా చెబుతున్నాయి. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్‌గావున్న అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు (ఏడీసీబీ)లో నోట్ల రద్దు తర్వాత ఆ నోట్ల డిపాజిట్లు వెల్లువెత్తాయి. జిల్లా సహకార బ్యాంక్ అన్నింటిలోనూ ఈ బ్యాంక్‌కే ఎక్కువ డిపాజిట్లు వచ్చాయి. ఐదురోజుల్లో మొత్తం రూ.745.59 కోట్ల విలువైన రూ.500, రూ. 1000 నోట్లు జమ అయ్యాయి. ముంబైకి చెందిన ఆర్‌టీఐ కార్యకర్త మనోరంజన్ ఎస్.రాయ్ తన పిటిషన్ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులతోపాటు, డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో రద్దైన పాత నోట్లు ఏ మేర జమ అయ్యాయో తెలపాలంటూ ముంబైకి చెందిన మనోరంజన్.. నాబార్డ్‌కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన నాబార్డ్ పూర్తి లెక్కలతోసహా వివరాలను అందించింది. ముఖ్యంగా గుజరాత్‌లో రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధికంగా రద్దైన నోట్లను స్వీకరించినట్లు వెల్లడైంది. అందులో ఒకటి అహ్మదాబాద్ డీసీసీబీ కాగా, రెండోది రాజ్‌కోట్ డీసీసీబీ.
ఐదు రోజుల్లోనే... అహ్మదాబాద్ డీసీబీకి అమిత్ షా 2000 సంవత్సరంలో చైర్మన్‌గా వ్యవహరించారు. గతకొన్నేళ్లుగా డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. నవంబర్ 8, 2016న ప్రధాని మోదీ రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. రద్దైన నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు కూడా ఇచ్చారు. అయితే కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే రూ.745. 59 కోట్ల విలువైన నోట్లు ఏడీసీబీలో డిపాజిట్ అయ్యాయి. విషయం ఏంటంటే కొన్నిరోజులకే డీసీసీబీల ద్వారా అనేక మంది నల్లధనాన్ని వైట్‌గా మార్చుకున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో నవంబర్ 14 నుంచి కేంద్రం డీసీసీబీల్లో నోట్ల డిపాజిట్‌ను నిలిపివేసింది. అయితే అప్పటికే రికార్డు స్థాయిలో డిపాజిట్లు జరిగిపోగా... ఎలాంటి విచారణకు ప్రభుత్వం ఆదేశించలేదు కూడా.
2017 మార్చి 31 నాటికి అహ్మదాబాద్ డీసీసీబీలో మొత్తం డిపాజిట్లు రూ. 5050 కోట్లు. ఇది రాష్ట్ర సహకార బ్యాంకు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఎంతలా అంటే ఎస్సీబీలో డిపాజిట్లు కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే. మరోవైపు రాజ్‌కోట్ డీసీసీబీలో కూడా రూ. 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్ జరిగింది. ఈ బ్యాంకు చైర్మన్ అయిన జయేష్ భాయ్ విఠల్‌భాయ్ రదాదియా.. ప్రస్తుతం గుజరాత్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ద్వారా బడాబాబులకే లబ్ధి చేకూరిందన్నది తేటతెల్లమైందని మనోరంజన్ అంటున్నారు.