ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఐకానిక్ టవర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్ధాపన చేశారు. ఏపీ ఎన్‌ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో 36 అంతస్తుల భవనాలను 500 కోట్ల వ్యయంతో 158 మీటర్ల మేర నిర్మించనున్నారు. రాయపూడిలోని ప్రభుత్వ భవనాల సముదాయానికి చేరువలో ఐకానిక్ టవర్ నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ టవర్‌ను ఏ ఆకారంలో అత్యాధునికమైన సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వసతులతో నిర్మించనున్నారు. భూగోళం రూపంలో తిరిగే రెస్టారెంట్ ఐకానిక్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో అత్యున్నతంగా భావించే ఎక్సోస్కెలిటెన్ విధానంలో ఈ టవర్లను నిర్మిస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్ తరహాలో పర్యావరణాని అనుకూలంగా భవనాల నిర్మాణం జరగనుంది. 18 నెలల్లో ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టవర్ల నిర్మాణ అనంతరం ప్రవాసాంధ్రులకు సంబంధించిన వివిధ సంస్ధలకు భూ కేటాయింపులు జరుపనున్నారు. భూమి పూజ అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు భవిష్యత్‌లో రాజధాని అమరావతిని విన్నూత్న ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తామంటూ ప్రకటించారు.