Russia Ukraine Conflict: భారీగా పెరగనున్న పెట్రో ధరలు.. లీటరుపై రూ.12 మేర పెంపునకు..
Russia Ukraine Conflict: దేశంలోని యూపీతో సహ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజీల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
Russia Ukraine Conflict: దేశంలోని యూపీతో సహ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజీల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతున్నాయి. పలు దేశాల్లో ఇందన ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలోనూ పెట్రోలు, డీజీల్ ధరలు పెరుగాయని వాహనదారులు అప్రమత్తమవుతున్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు 75 డాలర్లు ఉన్న ముడి చమురు బ్యారెల్ ధర.. 111 డాలర్లకు చేరింది. దీంతో వివిధ దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మన దేశంలో మాత్రం ఇప్పటివరకు స్థిరంగా ఉన్నాయి. ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ యూపీతో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మార్చి 7తో యూపీలో చివరి దశ ఎన్నికలు ముగుస్తున్నాయి. 10న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మార్చి 10 తరువాత నుంచి పెట్రో ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఐరోపా, ఆసియా దేశాలకు ముడి చమురును అధిక మొత్తంలో రష్యానే ఎగుమతి చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంతో రష్యా నుంచి చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 94 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా ప్రకటించింది. దీంతో బ్యారెల్ ధర ఏకంగా 111 డాలర్లకు చేరింది. ఎనిమిదేళ్ల తరువాత అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే చమురు ధరల కారణంగా కుదేలవుతున్న చమురు సంస్థలు మరిన్ని నష్టాల్లో కూరుకుపోనున్నాయి.
తమ మార్జిన్లు కోల్పోకుండాఉండాలంటే పెట్రోల్, డీజిల్‌పై మార్చి 16లోపు కనీసం లీటరుపై 12 రూపాయల మేర పెంచాల్సి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95 రూపాయలా 41 పైసలు కాగా, డీజిల్ ధర 86 రూపాయల 67 పైసలుగా ఉంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రేటును తగ్గించిన తర్వాత ఈ ధర అమలులోకి వచ్చింది. ఎన్నికల తరువాత 12 రూపాయల మేర పెట్రోలు ధరలు పెంచితే ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 107 రూపాయలు, డీజిల్ ధర 98 రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.
వివిధ దేశాల్లోనూ పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 160 రూపాయలకు చేరింది. శ్రీలంక, బంగ్లాదేశ్, వంటి దేశాల్లో భారీగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న తమకు పెట్రోలు ధరలు పెరిగితే వాహనాలను నడపలేని పరిస్థితి నెలకొంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.