House: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసా..?
House: మీరు తక్కువ ధరకే ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
House: మీరు తక్కువ ధరకే ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలోని ఎనిమిది నగరాల్లో అహ్మదాబాద్‌లో మాత్రమే సరసమైన ధరకి ఇల్లు లభిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ద్వారా తేలింది. దీని ప్రకారం.. 2022 ప్రథమార్థంలో దేశంలో ఈఎంఐ నిష్పత్తి ప్రకారం ఇంటిని కొనుగోలు చేసే సామర్థ్యం చాలావరకు తగ్గుముఖం పట్టింది.
నైట్ ఫ్రాంక్ ఇండియా 2022 (జనవరి-జూన్) మొదటి అర్ధభాగానికి సంబంధించిన అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఇది దేశంలో ఇళ్లు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తుల సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ నివేదిక ఈఎంఐ నుంచి ఆదాయ నిష్పత్తిని ట్రాక్ చేస్తుంది. నివేదిక ప్రకారం ఆర్‌బిఐ రెపో రేటును 0.90 శాతం పెంచడం వల్ల ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై ప్రభావం పడింది.
దీంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు గృహ రుణాలను ఖరీదైనవిగా మార్చాయి. అహ్మదాబాద్ టాప్ ఎనిమిది నగరాల్లో అత్యంత సరసమైన హౌసింగ్ మార్కెట్‌గా ఉంది. ఇక్కడ ఆదాయం-ఈఎంఐ నిష్పత్తి 22 శాతంగా ఉందని ప్రాపర్టీ అడ్వైజరి తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో 26 శాతంతో పుణె, చెన్నై ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఇల్లు కొనడం కష్టంగా మారిందని అన్నారు.
ప్రధాన మార్కెట్లలో సగటున స్థోమత 2-3 శాతం తగ్గిందని చెప్పారు. అయితే రేట్లు పెరిగినప్పటికీ మార్కెట్లు చాలా వరకు పొదుపుగా ఉన్నాయని తెలిపారు. ముంబై 2022 ప్రథమార్థంలో దేశంలో అత్యంత ఖరీదైన నివాస మార్కెట్‌గా ఉంది. దీని సూచిక 53 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. దేశంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ-ఎన్సీఆర్ మూడో స్థానంలో నిలిచాయి.