జీఎస్టీ మినహాయింపు ప్రయోజనాల కోసం గడువు పెంచిన ప్రభుత్వం.. ఎప్పటివరకూ అంటే..
GST: మినహాయింపు పథకం ప్రయోజనాలను పొందడానికి చివరి తేదీని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం పొడిగించింది.
GST: మినహాయింపు పథకం ప్రయోజనాలను పొందడానికి చివరి తేదీని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం మూడు నెలల వరకు పొడిగించింది. ఇంతకుముందు ఈ తేదీ ఆగస్టు 31 గా ఉండేది. ఈ పథకం కింద, పన్ను చెల్లింపుదారులు నెలవారీ రిటర్నులు దాఖలు చేయడంలో ఆలస్యం అయినందుకు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జిఎస్‌టి కౌన్సిల్, మే నెలలో పన్ను చెల్లింపుదారులకు ఆలస్య రుసుములకు ఉపశమనం కల్పించడానికి క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆలస్య రుసుము ప్రతి రిటర్న్‌కు రూ. 500 కి పరిమితం చేశారు.
జూలై 2017 నుండి ఏప్రిల్ 2021 వరకు GSTR-3B దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులకు ఆలస్య రుసుము ప్రతి రిటర్న్‌కు రూ .500 వరకు పరిమితి విధించారు.. వీటిపై పన్ను బాధ్యత లేదు. అదే సమయంలో, పన్ను బాధ్యత ఉన్నవారికి, ప్రతి రిటర్న్‌కు గరిష్టంగా రూ .1000 ఆలస్య రుసుము వసూలు చేయబడుతుంది. ఆలస్య రుసుము మినహాయింపు పథకం ప్రయోజనాన్ని పొందడానికి చివరి తేదీ ఇప్పుడు ఉన్న ఆగష్టు 31, 2021 నుండి నవంబర్ 30, 2021 వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.