PF withdrawal: ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త..జూన్ నుంచి యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా

PF withdrawal: ఈపీఎఫ్ఓ కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ఈపీఎఫ్ నుంచి నిధులు విత్ డ్రా చేసుకోవడం మరింత సులభం కానుంది. త్వరలోనే యూపీఐ నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ..ప్రావిడెండ్ ఫండ్స్ నిధులు పొందే విషయంలో చందాదారులు అనూహ్య మార్పులు చూడబోతున్నారని తెలిపారు. కేవలం నగద్ విత్ డ్రా మాత్రమే కాకుండా పీఎఫ్ లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని తెలిపారు. ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్ కు ఆ నగదును ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని తెలిపారు.
డిజిటలైజ్ చేయడంలో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతి సాధించిందని దావ్రా పేర్కొన్నారు. విత్ డ్రా సదుపాయాన్ని క్రమబద్ధీకరించడానికి 120కిపైగా డేటా బేస్ లను ఏకీక్రుతం చేసిందన్నారు. అంతేకాకుండా క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయంకూడా కేవలం 3 రోజులకు తగ్గిందని తెలిపారు. 95శాతం క్లెయిమ్స్ ఆటోమేటెడ్ ప్రాసెస్ రూపంలో జరుగుతుందన్నారు. యూపీఐ, ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా ఆప్షన్ అనేది ఒక మైలురాయి అని, లక్షలాది మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.