Gautam Adani: టెలికాం రంగంలోకి గౌతమ్ అదానీ?
Gautam Adani: 5జీ స్పెక్ట్రమ్ కోసం ఎయిర్‌టెల్, జియో
Gautam Adani: భారత బిలియనీర్ గౌతమ్ అదానీ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌కు షాక్ ఇచ్చారు. అదానీ కూడా టెలికాం రంగంపై కన్నేశారు. తాజాగా 5జీ స్పెక్ట్రమ్ కోసం అదానీ గ్రూప్స్ దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 26న జరిగే 5జీ వేలంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 5జీ స్పెక్ట్రమ్‌కు ఎయిర్‌టెల్, జియోతో పాటు వోడఫోన్ ఐడియాతో పాటు మరో దరఖాస్తు కూడా వచ్చిందని అది అదానీ గ్రూప్స్‌దేనన్న ప్రచారం జరుగుతోంది. అదానీ గ్రూప్స్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో గౌతమ్ అదానీ టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే గతంలో జియోలాగా భారీ ఆఫర్లు ఇస్తారా? అని సామాన్యులు చర్చించుకుంటున్నారు.
టెలికాం రంగంలోకి అడుగు పెట్టి ముకేష్ అంబానీ ఓ కుదుపు కుదిపారు. ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్, డొకోమో, యూనినార్ టెలికాం కంపెనీలు.. జీయో దెబ్బకు కుదేలయ్యాయ్యి. డొకొమో, యూనినార్ కంపెనీలు మూతపడ్డాయి. గత్యంతరంలేక మిగిలిన ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్‌లు జియో మార్గంలోకి వచ్చాయి. తీవ్ర నష్టాలను ఎదుర్కొంటూ జీయోతో పోటీని తట్టుకునేందుకు అపసోపాలు పడ్డాయి. నష్టాలను నివారించేందుకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ 2జీ, 3జీ సేవలను నిలిపేసింది. కేవలం 4జీ సేవలకే పరిమితమైంది. వోడాఫోన్ నష్టాలను భరించలేక ఐడియాతో కలిసిపోయింది. మారుమూల ప్రాంతాలకు దూరంగా ఉన్న 4జీ సేవలు పల్లెలకు వచ్చాయి. జీయో రాకతో ఇంటర్నెట్ వినియోగం పెరిగి సోషల్ మీడియా అంటే ఎంటో అందరికీ తెలిసి వచ్చింది.
ఇటీవల ఫ్రీకాల్స్, పరిమిత డేటా ప్లాన్ల ధరలను జియో భారీగా పెంచేసింది. అదే సమయంలో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్లాన్ల ధరలు ఆకాశాన్నంటాయి. అప్పటివరకు ఇన్‌కమింగ్ జీవిత కాలం ఫ్రీ అని ప్రకటించిన టెలికామ్ కంపెనీలు మాట మార్చేశాయి. నెలనెలా వాడినా వాడకపోయినా కనీసం 100 రూపాయల మేర ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవాల్సిందే. లేదంటే సిమ్ బ్లాక్ అయిపోతుంది. అందరూ జీయో ఇచ్చే ఫాస్ట్ ఇంటర్నెట్‌కు అలవాటు పడి రెండో సిమ్‌గా దాన్నే తీసుకున్నారు. ఆధార్, బ్యాంక్, గ్యాస్, పాన్ కార్డు ఇలా ప్రభుత్వ పథకాలకు అన్నింటికీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నంబర్లే అత్యధిక వినియోగదారులు వాడుతున్నారు. ఒకవైపు పెరిగిన జియో ప్లాన్ల ధరలు మరోవైపు ఇతర టెలికాం ఆపరేటర్ల సిమ్ మనుగడ కోసం వంద రూపాయలు వరకు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. కొందరు ఉన్న నంబరును జియోలోకి మార్చుకున్నారు. మరికొందరు మాత్రం రెండింటినీ భరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా 5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం ఎయిర్‌టెల్, జియో, వోడఫోన్ ఐడియాతో పాటు మరో దరఖాస్తు వచ్చిందన్న సమాచారం. ఈనెల 8తో 5జీ స్పెక్ట్రమ్ వేలానికి దరఖాస్తు గడువు ముగిసింది. జూలై 26న వేలం జరగనున్నది. ఆ నాలుగో అప్లికేషన్ అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీదేనని తెలుస్తోంది. అదానీ ఎంట్రీతో టెలికాం రంగంలో మరో విప్లవం రానున్నదా? అని అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. గతంలో జీయో ఇచ్చిన తరహాలోనే అదానీ కూడా ఆఫర్లు ఇస్తారా? అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా సిమ్‌లను వాడుతున్న ప్రజలను తమవైపు తిప్పుకోవాలంటే అదానీ భారీ ఆఫర్లనే ప్రకటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆఫర్లు లేకుండా ఆయా కంపెనీలతో పాటు ఉంటే మాత్రం.. వినియోగదారులు అదానీ సిమ్‌ను తీసుకునే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు.
అదానీ ఆఫర్లు ప్రకటిస్తే మాత్రం దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ కుదేలయ్యే అవకాశం ఉంది. పోటీని తట్టుకునేందుకు ఆయా సంస్థలు దిగిరావాల్సి ఉంటుంది. 5జీ స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసిన కంపెనీల వివరాలను మరో రెండ్రోజుల్లో ట్రాయ్ బయటపెట్టనున్నది. 72వేల 97 మెగా హెడ్జ్ స్పెక్ట్రమ్‌ను 4 లక్షల 30వేల కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తోంది. 5జీ సేవలను దిగువ, మధ్య, హై బ్యాండ్ విడ్త్‌తో ప్రభుత్వం ఇస్తోంది. 600 మెగా హెడ్జ్, 700, 800, 900, 18 వందలు, 2వేల 100, 2వేల 300 మెగా హెడ్జ్‌ను లో బ్యాండ్‌గా, 3వేల 300 మెగా హెడ్జ్‌ను మధ్య రకం బ్యాండ్‌గా, 26 గిగా హెడ్జ్‌ను హై బాండ్‌గా కేంద్రం విభజించింది. నాలుగు దరఖాస్తులకు ఈనెల 26న జరిగే వేలంలో స్పక్ట్రమ్‌ను కేటాయించనున్నది. ఈ 5జీ సేవలు 20 ఏళ్ల వరకు అందుబాటులో ఉంటాయి.
అయితే 5జీ స్పెక్ట్రమ్ వేలంలో వచ్చిన నాలుగో దరఖాస్తుపై అదానీ గ్రూప్స్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఒకవేళ అదానీ వస్తే మాత్రం మళ్లీ టెలికాం కంపెనీలకు చుక్కలు చూపించనున్నది. వినియోగదారులకు మాత్రం భారీ ఆఫర్ల పండగును ప్రకటించే అవకాశం ఉంది.