Fuel Prices: సామాన్యులకు ఊరట.. ఇంధన ధరలు తగ్గే అవకాశం..!
Fuel Prices: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి...
Fuel Prices: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ వాస్తవం ఏంటంటే కొన్ని నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కి ఒక్క రూపాయి తగ్గింది. ముడిచమురు ధర పెరగడంతో ఎన్నికల తర్వాత పెట్రోలు ధర లీటరుకు రూ.12 నుంచి 16 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న కాలంలో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ముడి చమురు బ్యారెల్‌కు $139 నుంచి $108.7కి పడిపోయే అవకాశాలు ఉన్నాయి.
భువనేశ్వర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.102.27 నుంచి రూ.101.81కి తగ్గింది. జైపూర్‌లో లీటరుకు రూ.108.07 నుంచి రూ.107.06కి తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధర 91 పైసలు తగ్గి రూ.90.70కి చేరుకుంది. పాట్నాలో రూ.106.44 నుంచి రూ.105.90గా నమోదైంది. అయితే గుర్గావ్‌లో పెట్రోలు ధర స్వల్పంగా పెరగడంతో లీటర్ రూ.95.59కి చేరింది. నోయిడాలో లీటరుకు రూ.95.73కి పెరిగింది. మెట్రో నగరాల్లో చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరులో ధరలు వరుసగా లీటరుకు రూ. 95.41, 104.67, 109.98, 91.43,, రూ.101.40గా ఉన్నాయి.
అతిపెద్ద రిఫైనరీని నడుపుతున్న BPCL చైర్మన్ MD అరుణ్ కుమార్ సింగ్ రాబోయే 2 వారాల్లో ఇంధన ధరలు లీటర్ $ 100 కంటే తక్కువకు రావచ్చు. ముడి చమురు బ్యారెల్‌కు 90 డాలర్ల స్థాయికి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2 నుంచి 3 వరకు తగ్గే అవకాశం ఉంది. గత వారం రోజులుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలలో మార్పులు సంభవిస్తున్న సంగతి తెలిసిందే.