MG Cyberster: స్టైలిష్ డోర్‌లతో ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్‌తో 507 కిలోమీటర్లు..!
MG Cyberster : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
MG Cyberster : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని పేరు 'ఎంజీ సైబర్‌స్టర్'. ఇది ఎలక్ట్రిక్ సూపర్‌కార్. జనవరి 2025లో జరగనున్న ఇండియా గ్లోబల్ మొబిలిటీ ఎక్స్‌పోలో కంపెనీ దీనిని ప్రదర్శిస్తుంది. అయితే అంతకంటే ముందు ఆ కారు టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. సైబర్‌స్టర్ కారులోని బెస్ట్ లుక్, డిజైన్‌ను తాజా టీజర్‌లో చూడవచ్చు. ఇది ఎంజీ ఎంపిక చేసినటువంటి డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మబడుతుంది. దీని డిజైన్, ఈ కారు అన్ని ఫీచర్లను ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం.
ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ సిజర్ డోర్స్ తో రాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ కారును తయారు చేయాలనే ఆలోచన 1960 ఎంజీ బీ రోడ్‌స్టర్ నుండి వచ్చింది. సైబర్‌స్టర్ డిజైన్ గురించి కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇందులో ఎల్ ఈడీ హెడ్‌ల్యాంప్‌లు అందించామన్నారు. దీని ఫ్రంట్ లుక్ చాలా ఎడ్జీగా ఉంది. ఇతర ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా కాకుండా, ఇది ఓపెన్ ఎయిర్ వెంట్లను కలిగి ఉంది. ఓపెన్ ఎయిర్ వెంట్స్ కలిగి ఉండడం వల్ల నిరంతరం బ్యాటరీని చల్లగా ఉంచుతాయి. సైబర్‌స్టర్ అతిపెద్ద ఫీచర్ పైకి తెరుచుకునే చాలా స్టైలిష్ గా ఉండే సిజర్ డోర్స్ . ఈ తలుపులు లంబోర్ఘిని కౌంటాచ్ కారును గుర్తు చేస్తాయి. వెనుక వైపున, కనెక్ట్ చేయబడిన లైట్లతో సీ-ఆకారపు ఎల్ ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. దీనికి యారో ఆకారపు ఇండికేటర్స్ అందించబడ్డాయి.
ఎంజీ సైబర్‌స్టర్ క్యాబిన్ మూడు స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. సెంటర్ కన్సోల్‌లో టచ్‌స్క్రీన్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, సైబర్‌స్టర్‌లో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ విత్ డయల్, బటన్ ఫర్ రీజెనరేషన్ ఆప్షన్, ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. స్టైలిష్ లుక్‌తో పాటు ADASతో కూడిన సేఫ్టీ కారుగా దీనిని కంపెనీ పేర్కొంది.
సైబర్‌స్టర్ రెండు సెటప్‌లలో వస్తుంది - సింగిల్, డ్యూయల్ మోటార్. ఎలక్ట్రిక్ కారు సింగిల్ మోటారు 64 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అయితే డ్యూయల్ మోటారు 77 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సింగిల్-మోటార్ రియర్-వీల్-డ్రైవ్ వెర్షన్ ఒక సారి పూర్తిగా చార్జి చేస్తే 507 కిమీ పరిధి మేరకు ప్రయాణించవచ్చు. డ్యూయల్ మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ పూర్తి ఛార్జ్‌తో 443 కిమీ (WLTP రేంజ్) నడుస్తుంది. ఇది కంఫర్ట్, కస్టమ్, స్పోర్ట్, ట్రాక్ అనే నాలుగు డ్రైవ్ మోడ్‌ల సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది.