వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర వచ్చేనెల 8 లేదా 9వ తేదీన ముగియనుంది. అనంతరం బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు జగన్. అయితే అంతకన్నా ముందే.. జగన్ తిరుమలకు పాదయాత్రగా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత పది,పదిహేను రోజుల్లో బస్సు యాత్రకు జగన్ సిద్ధమవుతున్నట్టు పార్టీవర్గాలు వెల్లడిస్తున్నాయి.
నవంబర్ మొదటివారంలోనే జగన్ పాదయాత్ర పూర్తి కావలసింది. కానీ కొన్ని కారణాలతో రెండు నెలలు ఆలస్యంగా ముగుస్తోంది. పాదయాత్ర తరువత జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర చెయ్యాల్సి ఉంది. కానీ.. పాదయాత్ర రెండు నెలలు ఆలస్యంగా ముగుస్తుండటం, పైగా ఎన్నికలు సమయం దగ్గరపడటంతో బస్సుయాత్రపై పునరాలోచనలో పడింది వైసీపీ. సాధారణ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో బస్సు యాత్ర కంటే డైరెక్ట్ గా ఎన్నికల ప్రచారానికే సిద్ధమవ్వాలని జగన్ భావిస్తున్నారట.. మరి ఆ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.