జనసేనలో ఏం జరుగుతుంది..?

-అధినేత ఒకవైపు.. ఎమ్మెల్యే మరోవైపు -సర్కారు నిర్ణయాలకు జై కొడుతున్న ఎమ్మెల్యే రాపాక

Update: 2020-01-11 15:38 GMT
Pawan Kalyan Janasena

అధినేత అమరావతికి జై కొడతారు. రైతుల పక్షాన పోరాడతామంటారు. అందుకు తగినట్లు తీర్మానం కూడా చేస్తారు. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలంటారు. అందుకోసం ఢిల్లీ ఫ్లైట్‌ కూడా ఎక్కారు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం అధికార పక్షానికి అండగా నిలుస్తారు. పార్టీ తీర్మానాన్ని పట్టించుకోరు, తనకు చెప్పే పరిస్థితి పార్టీలో లేదంటారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. పవన్ మాటను పెడచెవిన పెడుతున్నారా..? ఇంగ్లీష్ మీడియం నుంచి మూడు రాజధానుల వరకు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పార్టీ వ్యతిరేకిస్తున్నా రాపాక మాత్రం రైట్ అంటున్నారు.

వైసీపీలోకి వెళ్తే తన నెంబర్‌ 152 అవుతుందని.. అదే జనసేనలోనే ఉంటే తానే నెంబర్ వన్ అని మొదట్లో చెప్పుకొచ్చిన రాపాక వరప్రసాద్‌ మెల్లిమెల్లిగా అధికార పక్షానికి దగ్గరవుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకిస్తున్నా ఆయన మాత్రం స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన వ్యతిరేకించింది. దీనికి సంబంధించి తీర్మానం కూడా చేసింది. అయితే ఈ విషయంలో రాపాక మాత్రం సర్కారు నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు చదవితే అది తెలుగుకు అన్యాయం చేసినట్లు కాదని తేల్చిచెప్పారు.

దీంతో రాపాక విషయంలో.. జనసేన పార్టీ కూడా అంటీ ముట్టనట్లుగానే ఉంటుంది. పార్టీ నాయకులెవరూ ఆయన్ని కలిసిన దాఖలాలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఇటు పవన్ కూడా రాపాకను కలిసి చాలాకాలం గడిచింది. ప్రస్తుతం మంత్రి కొడాలి నానితో కలిసి.. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనకు చెప్పే పరిస్థితిలో లేదని.. అధినేత తననేమీ అడిగే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News