శ్రీవారి భక్తులకు షాకిచ్చిన టీటీడీ

Update: 2019-11-07 14:31 GMT

కలియుగ వైకుంఠం తిరుమలలో సామాన్య భక్తులకు టీటీడీ ఊహించని షాకిచ్చింది. తిరుమలలో అద్దె గదుల ధరలను అమాంతం పెంచేసింది. అయితే, తిరుపతిలో మాత్రం యథావిధిగా పాత ధరలే కొనసాగనున్నాయి.

శ్రీవారి భక్తులకు టీటీడీ షాకిచ్చింది. తిరుమలలో అద్దె గదుల ధరలను భారీగా పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని గెస్ట్‌-హౌస్‌ల్లోని గదుల అద్దెలనూ రెట్టింపు చేసింది. తిరుమల నందకం అద్దె గదుల ధరను 600 నుంచి వెయ్యికి పెంచగా, కౌస్తుభం, పాంచజన్యంలో రూమ్స్‌‌ను 500 రూపాయల నుంచి వెయ్యికి పెంచారు. అలాగే, కనీస వసతి ధరను వంద రూపాయలు చేశారు. అయితే, అద్దె గదుల ధరల పెంపు కేవలం తిరుమలలో మాత్రమే ఇంప్లిమెంట్ కానుంది. ఇక, తిరుపతిలో యథావిధిగా పాత ధరలే కొనసాగనున్నాయి.

అయితే, తిరుమలకు వచ్చే సామాన్య-ఎగువ-మధ్యతరగతి భక్తులు, 100 రూపాయల గదులను తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. కానీ, వంద రూపాయల గదులు తక్కువగా ఉండటం, అవి అందరికీ దొరకని పరిస్థితి ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఐదొందలు, ఆరొందల గదులను ఆశ్రయిస్తారు. అయితే, ఈ గదుల ధరలను ఇప్పుడు అమాంతం డబుల్ చేయడంతో సాధారణ భక్తులు మండిపడుతున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసి ఆనందంతో పరవశించిపోతారు. అయితే, శ్రీవారి భక్తుల్లో ఎంతోమంది భాగ్యవంతులు ఉన్నా ఎక్కువగా సామాన్య-ఎగువ-మధ్యతరగతి వాళ్లే ఉంటారు. అంతేకాదు శ్రీవారి దర్శనం రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో అద్దె గదులను ఆశ్రయిస్తారు. అయితే, టీటీడీ అద్దె గదుల ధరలను డబుల్ చేయడంతో సాధారణ భక్తులపై మరింత ఆర్ధిక భారం పడనుంది. 

Tags:    

Similar News