ఏపీకి 'టీసీఎస్' క్యాంపస్ వచ్చే అవకాశం!

ఏపీలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Update: 2020-01-12 06:59 GMT

ఏపీలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విశాఖపట్నంను ఐటీ హబ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ముందుగా పెద్ద కంపెనీని విశాఖకు తీసుకురావాలని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) సంస్థను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఇప్పటికే మంత్రి గౌతమ్ రెడ్డి టీసీఎస్ ప్రతినిధులతో రెండు దఫాలు చర్చలు జరిపారని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ నెలలో బెంగుళూరులో టీసీఎస్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి చర్చలు జరిపారని..

అలాగే ఈనెల మొదటి వారంలో కూడా నాగపూర్ లో మరోమారు చర్చలు జరిపారని.. టీసీఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని అన్నారు. త్వరలోనే ముంబైలోని సంస్థ పెద్దలతో మాట్లాడి విశాఖకు ఆ కంపెనీని తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పారు. అంతేకాదు నూతన ఐటీ పాలసీ ముసాయిదా కూడా రెడీ అయిందని శశిధర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు ఐటీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. ఈ కంపెనీలు నూతన ఐటీ పాలసీ కోసం ఎదురు చూస్తున్నాయని.. నూతన ఐటీ పాలసీని సీఎం వైఎస్ జగన్ ఆమోదించిన తరువాత ప్రకటిస్తామని శశిధర్ చెప్పారు. 

Tags:    

Similar News