మంగళగిరే ప్రజాతీర్పు ఇంకేం కావాలి: ఎమ్మెల్యే అమర్నాధ్

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అభిప్రాయపడ్డారు.

Update: 2020-01-04 06:42 GMT
గుడివాడ అమర్నాధ్

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అమర్నాధ్ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికోసం బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు సంస్థ ఇచ్చిన నివేదికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని అన్నారు. అలాగే ఆ సంస్థ ఇచ్చిన రిపోర్టులో 13 జిల్లాల్లోని 7 జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. ఒకేచోట లక్షల కోట్లు పెట్టి నగరాన్ని నిర్మించడం కన్నా ఆ డబ్బుతో రాష్ట్రమంతా అభివృద్ధి చేసుకోవచ్చని బోస్టన్ సంస్థ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. అసలు అమరావతి నిర్మించడం అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాసెస్ అని ఇందుకు ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

అమరావతిలో రైతులకు గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక రాజధాని తరలింపుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనవసర రాదంతం చేస్తున్నారని మండిపడ్డారు అమర్నాధ్. ఆరునెలలు అధికారం దూరం అయ్యేసరికి చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని విమర్శించారు. రాజధానిని అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.. అలా అయితే crda పరిధిలోని 30 నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలవలేదో సమాధానం చెప్పాలన్నారు. సొంత కొడుకు మంగళగిరిలో ఓడిపోతే ఇంకా ప్రజల మ్యాండేట్ కావాలని చంద్రబాబు కోరడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు చేసినటువంటి అవినీతిని గుర్తించే ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చారని అన్నారు. 

Tags:    

Similar News