బీజేపీ నేతలతో పవన్ భేటీ ఉంటుందా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Update: 2020-01-12 09:45 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతల అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.ఆదివారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ జేపీ నడ్డా తోపాటు హోంమంత్రి అమిత్‌షాలను కలుస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ పవన్ కు ఇంకా అపాయింట్మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. అమరావతి రాజధానిపై పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కలుస్తారని జనసేన లీకులు ఇచ్చింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికే బీజేపీతో పవన్ సంప్రదింపులు జరుపుతున్నారని కొందరు అంటున్నారు. పవన్ పర్యటనపై జనసేన మాత్రం ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. గత పర్యటనలోనూ పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో ఎదురు చూసి చివరకు అపాయింట్మెంట్ దొరక్కపోవంతో వెనక్కి వచ్చేశారు.

శనివారం జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగా మధ్యలోనే హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు పవన్. అంతకుముందు అమరావతిలో రైతులతో సమావేశం కావాల్సి ఉన్నా తన పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతోనే పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అమరావతి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతారని జనసేన నేతలు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. శనివారం.. అమరావతి ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు పవన్. కాగా అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరతానని పవన్ చెప్పారు. 

Tags:    

Similar News