టీడీపీని డిఫెన్స్‌లో పడేయడానికి సీఎం జగన్ స్కెచ్.. విశాఖలో కేబినెట్ భేటీ ?

Update: 2019-12-24 04:53 GMT
జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రి మండలి ఈ నెల 27న సమావేశం కానుంది. ఈ భేటీలో రాజధాని, రాష్ట్రాభివృద్ధి విషయమై జీఎన్ రావు కమిటీ చేసిన సిఫారసులపై చర్చించనుంది. అయితే, విశాఖలో కేబినెట్ సమావేశం జరపడం జగన్ వ్యూహంలో భాగంగానే తెలుస్తోంది.

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు జగన్ శాసన సభలో ప్రకటించడం దానికి అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ కమిటీ ఈ నెల 20న నివేదిక సమర్పించగా 27న కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

జీఎన్ రావు కమిటీ సిఫారసుల ప్రకారం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలు ఉంటాయి. కేబినెట్ భేటీలో ఈ సిఫారసులకు ఆమోదం తెలిపితే అనంతరం శాసన సభ సమావేశమై రాజధాని విషయమై నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఆరు నెలల్లోనే విశాఖకు సెక్రటేరియట్‌ను తరలించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్న వేళ విశాఖ ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పడానికి ఏపీ కేబినెట్ వైజాగ్‌లోనే సమావేశం అవుతుంది.

ఏపీలో నాలుగు రీజియన్ కమిషన్లను ఏర్పాటు చేయాలని కూడా జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసింది. దీని ప్రకారం ఉత్తరాంధ్ర రీజియన్‌ కమిషనరేట్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. మూడు జిల్లాలకు గుడ్ న్యూస్ చెప్పే ఉద్దేశంతో జగన్ వైజాగ్‌లో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని భావిస్తున్నారు. అంతేకాదు విశాఖలో కేబినెట్ భేటీ నిర్వహించడం ద్వారా సహజంగానే అక్కడి ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతుంది. దీంతో అమరావతి విషయమై టీడీపీ మరింత బలంగా నిరసన స్వరం వినిపించకుండా చేయడమే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. 

Tags:    

Similar News