Gurukul Pathshala: తరగతుల నిర్వహణపై ప్రతిపాదనలు.. 9,10 తరగతుల నిర్వహణపై ఏర్పాట్లు

Gurukul Pathshala: కరోనా వైరస్ వ్యాప్తి వల్ల విద్యా వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయ్యింది.

Update: 2020-08-29 03:02 GMT

Gurukul Pathshala

Gurukul Pathshala: కరోనా వైరస్ వ్యాప్తి వల్ల విద్యా వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయ్యింది. విద్యా సంవత్సరం చివరిలో ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో దీని ప్రభావం చివరి పరీక్షలపై పడి, వాటిని నిర్వహించకుండానే ఫలితాలను ప్రకటించాల్సి వచ్చింది. పోనీ కొత్త విద్యా సంవత్సరంలో అయినా తరగతులు నిర్వహిద్దామంటే వైరస్ తీవ్రత తగ్గని దుస్థితి. ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో ఏపీలో ఉన్న అన్ని శాఖలకు చెందిన గురుకుల పాఠశాలల్లో కేవలం 9,10 తరగతులు నిర్వహించేలా, అవసరమైన ఏర్పాట్లు, నిర్వహణ తీరుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తే తరగతులు నిర్వహణకు సమస్య తొలగిపోతుంది.

గురుకుల విద్యా సంస్థల్లో క్లాసుల నిర్వహణకు సంబంధించి అధికారులు కొన్ని ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అన్ని క్లాసులు ఒకేసారి నిర్వహించడం వీలుకాదని అధికారులు ఇటీవల సమావేశమై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్‌ సెక్రటరీ, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి పాల్గొన్నారు. వీరు పంపిన సూచనలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. అవేంటంటే..

► 2020–21 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో 9, 10, ఇంటర్‌ తరగతులను మాత్రమే నిర్వహించాలి.

► ప్రతి క్లాసును విద్యార్థుల సంఖ్య ఆధారంగా సెక్షన్లుగా విభజించాలి. ఒక్కో సెక్షన్‌లో 20 మంది విద్యార్థులు ఉండాలి.

► క్లాసులకు హజరయ్యే వారు చేతులను శుభ్రం చేసుకోవడం కోసం వాష్‌ బేసిన్‌ల సంఖ్యను పెంచాలి. ప్రతి విద్యార్థికి 3 మాస్కులు, శానిటైజర్‌ ఇవ్వాలి. పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు కోవిడ్‌–19పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.

► విద్యార్థులకు వైద్య చికిత్స అవసరమైనప్పుడు తీసుకెళ్లేందుకు వీలుగా మారుమూల గురుకుల పాఠశాలల వద్ద ఒక వాహనం అందుబాటులో ఉండాలి.

► స్కూళ్ళకు సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

► గురుకులాల్లో మిగిలిన తరగతులు చదువుతున్న విద్యార్థులకు 'విద్యామృతం' కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించాలి.

► కరోనా వ్యాధిపై ప్రభుత్వం, వైద్య శాఖ సూచనల మేరకు దశల వారీగా మిగిలిన క్లాసుల విద్యార్థులను కూడా గురుకులాలకు పిలిపించాలి.


Tags:    

Similar News