రగిలిన రాజధాని రైతులు

Update: 2019-12-18 06:17 GMT
అమరావతి రైతులు

మూడు రాజధానుల అంశంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి కృష్ణాయపాలెం, మందడంలో రాజధాని ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నా చేపట్టారు. సచివాలయానికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు రావొచ్చని జగన్ సంకేతాలిచ్చారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావొచ్చన్న సీఎం కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ కావొచ్చని వ్యాఖ్యానించారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండొచ్చన్నారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని, ఈ తరహా అభివృద్ధి వికేంద్రీకరణ మనకు అవసరం అని జగన్ తెలిపారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు పెద్ద ఖర్చేమీ అవసరం ఉండదన్నారు.

అయితే సీఎం జగన్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. ఏపీకి మూడు రాజధానులంటూ జగన్‌ చేసిన ప్రకటనను కొందరు స్వాగతిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News