వెండి తెర...ప్రేమ్ నగర్ నుండి బుల్లితెర ప్రేమ్ నగర్ వరకు ఆమెకు ఆమె సాటి, ఆమె చిల్లరకొట్టు చిట్టెమ్మగా సినిమాల్లో కథానాయకిగా... తల్లిగా...అత్తగా వేసిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి, ఆవిడే మన వాణిశ్రీ. 1960 మరియు 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. నాదీ ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినపుడు ఎస్. వి. రంగారావు ఈమెకు వాణిశ్రీ అనే పేరు పెట్టాడు. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది.
మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగుచిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార. ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది. ఈ మద్యే బుల్లితెర పై కూడా ప్రేమనగర్ తో మన ముందుకు వస్తుంది.