జంతువులలో దిగ్గజం.. దీన పరిస్థితిలో ప్రస్తుతం!

Update: 2019-07-29 06:14 GMT

పెద్దపులి.. మన జాతీయ జంతువు. పులితో మనకి ఎన్నో అనుబంధాలు ముడిపడి ఉన్నాయి. పులిని ఒక భయంకర జంతువుగా చూసినా.. పులిని తలుచుకుంటూనే మన జీవితంలో చాల రోజులు గడుస్తాయి. నాన్నా పులి కథ నుంచి.. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే సామెత వరకూ.. పులికి సంబంధించిన ఎన్నో విశేషాలు మన జీవితంలో ముడిపడి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పులిని అమ్మవారి వాహనంగా.. అయ్యప్ప వాహనంగా ఇలా ఆధ్యాత్మిక చింతన లోనూ పులికి ఓ విశిష్ట స్థానం ఇచ్చారు. ఈ రోజు(29, జూలై) ప్రపంచ పులుల దినోత్సవం. ఈ సందర్భంగా పులుల గురించి కొన్ని విశేషాలు..

మనదేశంలో పులుల సంఖ్య పెరిగింది..

మన దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్లలో 700 పులులు పెరిగినట్టు గణాంకాలు  చెబుతున్నాయి. 2,967 పులులతో ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యమైన దేశంగా ఉందన్నారు. మామూలుగా అయితే ఇది పెద్ద పట్టించుకోవాల్సిన వార్త కాదు. కానీ, ప్రస్తుతం పులి జాతి పరిస్థతి తెలుసుకుంటే ఇది ఎంత పెద్ద వార్తో అర్థం అవుతుంది.

జంతువులలో దిగ్గజం.. దీన పరిస్థితిలో ప్రస్తుతం!

పులి.. టైగర్.. జంతువులలో దిగ్గజం. ప్రస్తుతం దీన పరిస్థితులలో ఉంది. మనుగడ రోజు రోజుకూ కష్టరమైపోతోంది పులి జాతికి. దాదాపుగా అంతరించే స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఈ టైగర్. పిల్లి జాతికి చెందిన అతి పెద్ద జంతువు ఇదే. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీని మనుగడకు ముప్పు వాటిల్లింది.

వందేళ్ల క్రితం దాదాపు లక్ష వరకూ పులులు ఈ జగతిలో సంచరించేవి. ఇప్పుడు కేవలం 3,900 మాత్రమే జీవించి ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆ జాతి దీన స్థితి. 20వ శతాబ్ధి ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 95శాతం పులి జాతి అంతరించిపోయింది.

కారణాలు ఇవే..

- పులి శరీరం లోని ప్రతి భాగమూ దాని మనుగడకు ముప్పు తెచ్చేదిగా తయారైంది అంటే నమ్మగలరా? ఇదే నిజం. ప్రపంచంలో ఏ జంతువుకూ లేని విశిష్టత పులికి ఉంది. అది.. దాని శరీరంలోని ప్రతి భాగమూ ఎదో రకంగా మానవునికి ఉపయోగపడేదే. ముఖ్యంగా ఔషధంగా. దానితో పులి విలువ డబ్బు పరంగా చాలా ఎక్కువ. అందుకే పులి దొరికితే చంపేయడం మొదలెట్టారు. వేటాడి మరీ చంపుకుంటూ పోయారు.

- అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం చాలా ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. పులికి విశాలమైన అరణ్యప్రాంతం ఉండాలి. దాని జీవన విధానానికి అవసరమైన ఆహరం, నీరు లభించే అంత అరణ్యాలు ఇప్పుడు అంతరించి పోయాయి. ఇష్టానుసారంగా చెట్లను నరుక్కుంటూ పోతుంటే.. అటవీ విస్తేర్ణం తగ్గిపోయి పులుల సంఖ్యా క్రమేపీ తగ్గిపోయింది.

- వాతావరణ మార్పూ ఓ కారణమే. వాతావరణంలో వచ్చిన మార్పులతో సముద్ర మట్టాలు పెరిగిపోయాయి. దీనితో సుందర్బన్ అటవీ ప్రాంతం కుచించుకు పోయింది. ఇది రాయల్ బెంగాల్ టైగర్స్ ఆవాస ప్రాంతం. అందుకే ఆ జాతి పులుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది.

- ఇంకా.. మానవుడికి-జంతువుకీ మధ్యలో జీవన పరిస్థితుల గురించిన పోరాటం లో మానవునిదే పై చేయికావడం, పులులకు సహజ సిద్ధంగా కావలసిన ప్రశాంతమైన విశాల ప్రాంతాలు కనుమరుగు కావడం, టూరిజం పేరిట అరణ్యాలలో మానవుల సంచారం పెరిగిపోవడం.. ఇలా చాలా కారణాలు పులులు అంతరించిపోవడానికి కారణమయ్యాయి.

వరల్డ్ టైగర్స్ డే ఎందుకు.. ఎప్పటినుంచి..

రష్యాలో 2010లో సెయింట్ పీటర్స్ బర్గ్ టైగర్ సమ్మిట్ నిర్వహించారు. పులుల సంరక్షణే ప్రధాన ధ్యేయంగా ఈ సదస్సు నిర్వహించారు. ఇందులో పులుల సంరక్షణ గురించి తీసుకోవాల్సిన విధి విధానాలు రూపొందించారు. ఈ సందర్భంగా పులులు ఆవసముంటున్న దేశాల నుంచి 2020 సంవత్సరంలోపు ఆయా ప్రాంతాల్లో పులుల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రతిజ్ఞా చేశారు. ప్రతి సంవత్సరం దీనికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే జూలై 29 ని పులుల సంరక్షణ దినంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు.

మన దేశంలో పులుల లెక్క ఇదీ..




 


మనదేశంలో ఈ నిర్ణయాల్ని అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. అందుకే పైన చెప్పుకున్నట్టు పులుల సంతతి నాలుగేళ్లలో 700 పెరిగింది. ఇంకా ఇది పెరగాల్సిన అవసరం ఉంది. మన మనుగడతో పాటు, పులుల మనుగడ కూడా ముఖ్యమే కాదంటారా? పులుల మనుగడలో వచ్చిన పెను మార్పులు మానవజాతికి కూడా హెచ్చరికే అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Tags:    

Similar News