KTR: తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం

KTR: మానవ జీవితం పరిమిత కాలమనే ఫిలాసఫీని నమ్ముతున్నా

Update: 2023-01-16 04:13 GMT

KTR: తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాం

KTR: తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మానవ జీవితం పరిమిత కాలమనే ఫిలాసఫీని నమ్మి, సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. స్విట్జర్లాండ్‌లోని జురిక్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో ఆయన పాల్గొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖతో రాష్ట్రంలో కొంత ప్రచారం లభిస్తోందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారాయన.

తాను కూడా ఒక ప్రవాస భారతీయుడినేనని, కొంతకాలం విదేశంలో పని చేసి భారతదేశానికి వెళ్లానన్నారు. ప్రవాస భారతీయులతో మకర సంక్రాంతి జరుపుకొనే అవకాశం ఇచ్చినందుకు ప్రవాస అభ్యర్థులందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దావోస్ వచ్చిన ప్రతిసారీ స్విట్జర్లాండ్‌లోని ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు చాలా గొప్పగా ఉంటుందన్నారు. దేశంలో ఉన్న వారితో పోల్చుకుంటే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానికంగా ఉన్న అంశాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందన్నారు.

ఓ వైపు ఐటీ పరిశ్రమ ఉత్పత్తులు, మరో వైపు వ్యవసాయ రంగంలో పంటల ఉత్పత్తులు అనేక రెట్లు పెరిగాయన్నారు మంత్రి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా పల్లెలు, పట్టణాలు సైతం దేశంలో ఆదర్శ గ్రామాలు, పట్టణాలుగా గుర్తింపు పొందాయన్నారు. గ్రామానికి కావాల్సిన కనీస మౌలిక వసతుల కల్పన, అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెద్దఎత్తున గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News