Heavy Rains: ముసురేసిన తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్..

Heavy Rains: ఏపీ, తెలంగాణలో కొన్నిచోట్ల వాన ముసురేయగా.. మరికొన్ని చోట్ల వర్షం దంచికొడుతుంది.

Update: 2024-07-20 05:43 GMT

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్..మూడు రోజులు అతి భారీ వర్షాలు

Heavy Rains: ఏపీ, తెలంగాణలో కొన్నిచోట్ల వాన ముసురేయగా.. మరికొన్ని చోట్ల వర్షం దంచికొడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది.

మరో వైపు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా 10 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఉత్తర తెలంగాణలో రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక హైదరాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, ఎన్.మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇక ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News