Samsung Galaxy A22 5G: లీకైన ఫీచర్లు.. తక్కువ ధరలో శాంసంగ్ 5జీ ఫోన్!
Samsung Galaxy A22 5G: శాంసంగ్ ఏ సిరీస్‌లో గెలాక్సీ ఏ22 4జీ, గెలాక్సీ ఏ22 5జీ ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Samsung Galaxy A22 5G: వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తూ... విపణిలో శాంసంగ్ కంపెనీ దూసుకపోతోంది. తాజాగా ఏ సిరీస్‌లో గెలాక్సీ ఏ22 4జీ, గెలాక్సీ ఏ22 5జీ ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతానికి శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ ఫోన్ స్పెషిఫికేషన్లు మాత్రమే లీకయ్యాయి.
నెట్టింట్లో లీకైన ఫీచర్ల మేరకు.. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఇప్పటికే ఈ రిఫ్రెష్ రేట్ తో పలు ఫోన్లను శాంసంగ్ విడుదల చేసింది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ నడవనుంది. కాగా, ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్స్ ఉన్నట్లు సమాచారం. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీకి పెంచుకోవచ్చు.
ఏ22 5జీలో వెనకవైపు 3 కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో మెయిన్ కెమెరా సామర్థ్యం 48 MP కాగా, దీంతోపాటు 2 MP డెప్త్ సెన్సార్, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉండనున్నాయని టాక్. ఇక ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 MP సెన్సార్‌ను అందించనున్నారు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది. ఫోన్ సైడ్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చినట్లు తెలుస్తోంది. 5జీ, 4జీ, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, వైఫై, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఈ ఫోన్ మందం 0.9 సెంటీమీటర్లుగానూ, బరువు 203 గ్రాములుగానూ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ నెలలోనే ఈ ఫోన్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. 5జీ వేరియంట్ ధర 250 యూరోలలోపే(మన కరెన్సీలో రూ.22,250) ఉండబోతోందని సమాచారం. అయితే మనదేశంలో ఈ ఫోన్లు ఇంకా తక్కువ ధరల్లోనే విడుదల అయ్యే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.