Google Maps: గాలి నాణ్యతను చెప్పేసే కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే..
Google Maps: ప్రస్తుతం గాలి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. పారిశ్రామీకరణ, వాహనాలు భారీగా పెరగడం కారణం ఏదైనా వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా మారింది.
Google Maps: ప్రస్తుతం గాలి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. పారిశ్రామీకరణ, వాహనాలు భారీగా పెరగడం కారణం ఏదైనా వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితులు దారుణంగా దిగజారాయి. అక్కడ ఏకంగా ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా ఆపేసే పరిస్థితి వచ్చింది. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
ఇలా గాలి కాలుష్యం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. అయితే మీరు ఉంటున్న ప్రదేశంలో గాలి బాగానే ఉందా.? లేదా కాలుష్యంతో నిండి ఉందా.? అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా.? ఇంతకీ గాలు కాలుష్యాన్ని ఎలా తెలుసుకోవాలి. ఇదిగో ఈ ఆలోచనే చేసింది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్. మీరున్న ప్రదేశంలో గాలి నాణ్యతను తెలుసుకునేందుకు వీలుగా మ్యాప్స్‌లో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఎయిప్ వ్యూ ఫీచర్ పేరుతో ఈ కొత్త టూల్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది.? దీనిని ఎలా ఉపయోగించుకోవాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశం అంతటా రియల్ టైమ్‌లో హైపర్ లోకల్ ఎయిర్ క్వాలిటీ సమాచారాన్ని అందించే విధంగా ఈ కొత్త టూల్‌ను తీసుకొచ్చారు. భారత దేశంలో మొత్తం 150కిపైగా పట్టణాల్లో వాయు నాణ్యతను ఈ ఫీచర్ చెప్పేస్తుంది. ఇందులో భాగంగానే పీఎం2.5, పీఎం10, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను కొలవడానికి యుటిలిటీ పోల్స్‌ను, వాణిజ్య స్థలాలు, పరిపాలనా భవనాలపై సెన్సార్లను ఏర్పాటు చేశారు.
ఈ సెన్సార్లు గాలిలో తేమ, ఉష్ణోగ్రత, ఉద్గారాలు వంటి వాటిని లెక్కకడుతుంది. ఈ సెన్సార్‌ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్‌లకు చెందిన పరిశోధకులు గూగుల్ ఏఐ టెక్నాలజీ సహాయంతో విశ్లేషిస్తారు. ఈ సమాచారాన్ని మున్సిపల్ అధికారులతో పాటు పౌరులకు అందుబాటులో ఉంచుతారు. ప్రాంతాల వారీగా వాయు కాలుష్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఈ ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలంటే..
ఇందుకోసం గూగుల్ మ్యాప్స్‌లో 'ఎయిర్ క్వాలిటీ లేయర్' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా వెదర్ విడ్జెట్‌ను క్లిక్ చేసినా వాయు కాలుష్యం తెలుస్తుంది. మీరు కోరుకున్న ప్రదేశలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందన్న వివరాలను సదరు ప్రదేశంను ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.