iPhone Free Service: ఈ ఐఫోన్లలో కెమెరా ప్రాబ్లమ్స్.. 'ఫ్రీ సర్వీస్' ఆఫర్ ఇస్తోన్న యాపిల్
Free service repair program for iPhone 14 Plus: ఐఫోన్ అంటే అదొక క్రేజ్.. అదొక స్టేటస్. ఐఫోన్ అంటే ఎందుకంత క్రేజ్ అని అడిగిే.. ఐఫోన్‌లో ఉండే ఫీచర్స్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్ అలాంటిది మరి అంటుంటారు ఆ ఫోన్లు ఉపయోగించే వాళ్లు. మరి అంత ఇష్టపడి కొనుక్కున్న ఆ ఫోన్‌కి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ సమస్య ఎంత చికాకు పెడుతుందో చెప్పండి!! ఒకవేళ వారంటీ, గ్యారెంటీలు ఉంటే పర్వాలేదు కానీ అవి లేకపోతే ఐఫోన్ సర్వీసింగ్ కూడా ఖరీదైన వ్యవహరమే అంటుంటారు. ఐఫోన్ 14 ప్లస్ ఉపయోగిస్తోన్న వాళ్లలో కొంతమందికి తాజాగా ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతోందట. ఇంతకీ ఐఫోన్ 14 ప్లస్ యూజర్స్ ని చికాకు పెడుతోన్న సమస్య ఏంటి? వారి కోసం యాపిల్ తీసుకొచ్చిన పరిష్కారం ఏంటనేది తెలుసుకోవాలంటే మనం ఈ విషయంలో ఇంకొంచెం డీటేయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.
ఇంతకీ సమస్య ఏంటి?
ఐఫోన్ 14 ప్లస్ మొబైల్ వెనుక భాగంలో ఉండే కెమెరా ప్రివ్యూ కనిపించడం లేదని కొంతమంది యూజర్స్ ఫిర్యాదు చేస్తున్నారు. కెమెరా ప్రివ్యూ అంటే అర్థమైంది కదా.. ఫోటోలు కానీ లేదా వీడియోలు కానీ షూట్ చేసేటప్పుడు స్క్రీన్ పై కనిపించే ప్రివ్యూ అన్నమాట. మొబైల్ వెనుక భాగంలో ఉండే కెమెరాలో ఈ సమస్య తలెత్తుతున్నట్లు కస్టమర్స్ ఫిర్యాదు చేస్తున్నారు. తరచుగా ఈ ఫిర్యాదులు వస్తుండటంతో ఈ అంశాన్ని పరిశీలించిన యాపిల్ కంపెనీ, తమ కస్టమర్స్ కోసం ఉచితంగా సర్వీస్ అందించేందుకు ముందుకొచ్చింది.
ఏయే ఫోన్లకు ఈ ఫ్రీ సర్వీస్ అవకాశం ఉంది?
కేవలం కొన్ని ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో మాత్రమే ఈ సమస్య ఉంది. అందుకే వారికి మాత్రమే ఈ ఫ్రీ సర్వీస్ అవకాశం అందుబాటులో ఉంటుందని యాపిల్ కంపెనీ స్పష్టంచేసింది. మరీ ముఖ్యంగా 2023 ఏప్రిల్ 10 నుండి 2024 ఏప్రిల్ 28 మధ్య కాలంలో తయారైన ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలోనే ఈ లోపం తలెత్తుతున్నట్లుగా యాపిల్ గుర్తించింది. అంటే మీ వద్ద ఉన్న ఐఫోన్ 14 ప్లస్ ఈ రెండు తేదీల మధ్య తయారై ఉండి, అందులో లోపం ఉన్నట్లయితేనే ఈ ఫ్రీ సర్వీస్ వర్తిస్తుంది.
మరి ఫ్రీ రిపేర్ రిపేర్ ప్రోగ్రామ్‌కి అర్హత ఉందో లేదో తెలిసేదెలా?
ఒకవేళ మీ ఐఫోన్ 14 ప్లస్‌లో ఇలాంటి ప్రాబ్లం ఉండి, అది ఫ్రీ సర్వీస్‌కి అర్హత ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే అందుకోసం ఒక మార్గం ఉంది. యాపిల్ సపోర్ట్ పేజీలోకి వెళ్లి అక్కడ సూచిస్తున్న బాక్సులో మీ ఐఫోన్ 14 ప్లస్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఐ ఫోన్‌కి ఫ్రీ సర్వీస్ అవకాశం ఉందో లేదో అక్కడే తెలిసిపోతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. అదేంటంటే.. ఐఫోన్ 14 ప్లస్ ఏ లోపం కారణంగా అయితే రియర్ కెమెరా ప్రివ్యూ కనిపించడం లేదని యాపిల్ గుర్తించిందో, కేవలం ఆ సమస్యను మాత్రం రీపేర్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్‌కు సంబంధం లేకుండా వేరే ఇతర సమస్యలు ఉన్నట్లయితే.. వాటికి యాపిల్ ఫ్రీ సర్వీస్ అందించదు. ఒకవేళ అదనంగా ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే.. అందుకు అవసరమైన సర్వీస్ చార్జ్ వసూలు చేయడం జరుగుతుందని యాపిల్ కంపెనీ స్పష్టంచేసింది.