WTC Final: నేటి నుంచే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్
WTC Final: ఫైనల్‌లో తలపడుతున్న భారత్-ఆస్ట్రేలియా
WTC Final: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సర్వం సిద్ధమైంది. భారత్–ఆస్ట్రేలియా మధ్య నేడు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఏ టీమ్ గెలిచినా అన్ని ఫార్మాట్లలోనూ ఐసీసీ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా తొలిసారిగా ఈ టెస్టు గదను దక్కించుకున్న జట్టుగా నిలుస్తుంది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలో భారత జట్టు 2013లో చాంపియన్స్ ట్రోఫీ ద్వారా చివరిసారిగా ఐసీసీ టోర్నీ సాధించింది. అప్పటి నుంచి దశాబ్దకాలంగా టీమిండియాను ఐసీసీ ట్రోఫీలు ఊరిస్తూనే ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఓవల్ మైదానంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆరంభం కాబోతోంది. ఐపీఎల్ ముందు ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2–1తో గెలిచింది. కానీ ఇంగ్లండ్‌లోని పరిస్థితులు తమకే లాభిస్తాయని ఆసీస్ భావిస్తూ ఉంది. ఈ మ్యాచ్ విజయం ద్వారా భారత్‌లో జరిగిన బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో సిరీస్ ఓటమికి ఆసీస్ బదులు తీర్చుకోవాలనుకుంటోంది.
ఓవల్‌లో స్టీవ్ స్మిత్‌కు అద్భుత రికార్డు ఉండడం ఆసీస్ కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లోనే తను 97.75 సగటుతో 391 పరుగులు సాధించాడు. వార్నర్, ఖవాజా, లబుషేన్, హెడ్, గ్రీన్ లను కట్టడి చేయాల్సి ఉంది. భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా.. లేక నలుగురా.. అనే విషయం మ్యాచ్ ముందే ఓ క్లారిటీ రానుంది. అశ్విన్-జడేజా మధ్య పోటీ ఉండగా.. జడ్డూనే ఆడించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది.
పిచ్‌ను చూశాకే స్పిన్నర్ల ఎంపిక ఉంటుందని కెప్టెన్ రోహిత్ స్పష్టం చేశాడు. కేఎస్ భరత్, ఇషాన్ కిషన్‌లలో ఎవరికి కీపింగ్ బాధ్యతలు ఇవ్వనున్నారనేది కూడా ఆసక్తి రేపుతోంది. నలుగురు పేసర్లు బరిలోకి దిగితే షమి, సిరాజ్‌లకు తోడు శార్దూల్, ఉమేశ్ ఆడవచ్చు. గిల్, రోహిత్, పుజార, కోహ్లీ, రహానెలతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా కనిపిస్తూ ఉంది. బౌన్సీ పిచ్ ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నాడు. తొలి మూడు రోజులపాటు వరుణుడి నుంచి ఎలాంటి అంతరాయం లేదని అంటున్నారు. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.