WTC Final 2023: తొలి ఆటపై పట్టు సాధించిన ఆస్ట్రేలియా
WTC Final 2023: ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఆటతీరు
WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఆస్ట్రేలియా, భారతజట్లు హోరాహోరీ పోరుకు ఓవల్ స్టేడియం వేదికగా నిలిచింది. టాస్ గెలిచిన టిమిండియా కెప్టన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 327 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా గోల్డెన్ డకౌట్ అవ్వగా.. డేవిడ్ వార్నర్, లబూ షేన్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. వార్నర్ దూకుడు ఆడి అర్థ శతకానికి చేరువయ్యే ప్రయత్నంలో 43 పరుగులతో పెవీలియన్ బాటపట్టాడు. ఆతర్వాత కొద్ధి సేపటికే లబూషేన్ క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆటతీరుతో పరుగుల ప్రవాహం పారించారు. ట్రావిస్ హెడ్ వన్డే మ్యాచ్ తరహాలో 156 బంతుల్లో146 పరుగులు నమోదు చేశాడు. స్టీవ్ స్మిత్ 227 బంతులు ఎదుర్కొని 95 పరుగులు నమోదు చేశాడు.
తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియాదే పైచేయిగా నిలిచింది. టీమిండియా బౌలర్లు ఆచితూచి బంతులు వేస్తున్నప్పటికీ... ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆటతీరుతో ఆశాజనకంగా పరుగులు రాబట్టుకోగలిగారు. మహ్మద్ షమీ, మహ్మాద్ సిరాజ్, శార్థుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదే తరహాలో ఆట కొనసాగితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ భారీగా పరుగులు సాధించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టీమిండియా, ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకు కట్టడి చేయగలిగితే.. టెస్టు మ్యాచ్‌పై పట్టుసాధించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీమిండియాపై నెగ్గి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించాలని ఆస్ట్రేలియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. మిగిలిన నాలుగు రోజుల్లో క్రికెట్ ఎలాంటి మలుపులు తిరిగి విజేతను ఎవరిని వరిస్తుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.