IPL 2023: సిరాజ్ ఇంట్లో ఆర్సీబీ టీమ్ సందడి.. తరలివచ్చిన కింగ్ కోహ్లీ ఫ్యాన్స్..!
ఆర్ సీబీ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్..తన టీమ్ కు ఆతిథ్యం ఇచ్చాడు. కొత్తగా నిర్మించిన తన ఇంటికి ఆర్ సీబీ టీమ్ మొత్తాన్ని డిన్నర్ కు ఆహ్వానించాడు.
IPL 2023: ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. రికార్డుల హోరు..ఈ క్రమంలో జరుగుతున్న 16వ సీజన్ ఐపీఎల్ టోర్నీ సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ క్రికెట్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తుతోంది. ప్లే ఆఫ్స్ కు సమీపిస్తున్న తరుణంలో ప్రతి జట్టు నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీపడుతున్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్ లో భాగంగా తాము ప్రాతినిధ్యం వహించే జట్లు తమ సొంత రాష్ట్రానికి మ్యాచుల కోసం వెళ్లినప్పుడు..అందులోని లోకల్ ప్లేయర్స్ వారికి విందు ఇస్తుంటారు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ లోని తిలక్ వర్మ ఇంట్లో ఆ జట్టు ప్లేయర్లు సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ సహా చాలామంది ముంబై ఆటగాళ్లు తిలక్ వర్మ ఇంటికి వెళ్లారు. కట్ చేస్తే ఇప్పుడు సిరాజ్ వంతు వచ్చింది.
ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ నెల 18న తలపడనుంది. హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. మ్యాచు కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాదీ, ఆర్ సీబీ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్..తన టీమ్ కు ఆతిథ్యం ఇచ్చాడు. కొత్తగా నిర్మించిన తన ఇంటికి ఆర్ సీబీ టీమ్ మొత్తాన్ని డిన్నర్ కు ఆహ్వానించాడు. సిరాజ్ ఇచ్చిన విందుకు విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్ తో సహా పలువురు ఆర్ సీబీ ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ హాజరు అయ్యారు. సిరాజ్ ఇంట సందడి చేసి హైదరాబాద్ ఫుడ్ ను ఎంజాయ్ చేశారు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా సిరాజ్ కుటుంబం జాగ్రత్తపడినప్పటికీ...కోహ్లీ అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు ఎగబడ్డారు. ఈ దృశ్యాలను ఓ అభిమాని వీడియో తీసి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
మహమ్మద్ సిరాజ్ తన నూతన నివాసాన్ని హైదరాబాద్ లోని ఫిలిమ్ నగర్ లో కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ సీబీ టీమ్ గతంలో సైతం సిరాజ్ ఇంట హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేసింది. ఇకపోతే, చివరిగా రాజస్థాన్ రాయల్స్ పై గెలుపొంది ఆర్ సీబీ తన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. లీగ్ దశలో ఆర్ సీబీ మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచులు గెలిస్తే కోహ్లీ సేన ముందంజ వేసే అవకాశం ఉంది. ఇక, ఈ సీజన్ లో మహమ్మద్ సిరాజ్ 12 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు.