Usain Bolt tests positive for coronavirus: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.'గుడ్ మార్నింగ్.. నాకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షలో ఇది బయటపడింది. నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను నా స్నేహితుల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. అందుకే హోం క్వారంటైన్‌లోకి వెళ్తున్నాను. ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్ ఏంటనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకోవాలిని భావిస్తున్నాను. నా ప్రజలు అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను' అన్నారు బోల్ట్.
ఎనిమిది సార్లు ఒలింపిక్ స్వర్ణపతక విజేత అయిన బోల్ట్.. ఇటీవల జరుపుకొన్న 34వ జన్మదిన వేడుకల్లో మాస్క్ ధరించకపోవటమే కొంపముంచిందని భావిస్తున్నారు. ఇందులో ప్రముఖులతో పాటు చాలా మంది పాలుపంచుకున్నారు. అయితే ఈ పార్టీకి హాజరయిన వారు ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. భౌతిక దూరం అనే మాటేలేదు. విచ్చలవిడిగా ప్రవర్తించారని సమాచారం. అయితే, ఇప్పుడు ఉసేన్ బోల్ట్ కరోనా బారినపడటంతో ఆ పార్టీలో పాల్గొన్నవారందరూ ఆందోళనకు గురవుతున్నారు.
Stay Safe my ppl 🙏🏿 pic.twitter.com/ebwJFF5Ka9
— Usain St. Leo Bolt (@usainbolt) August 24, 2020