టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలోని సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. టోక్యోలోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఆ 35 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకిందని ఒలింపిక్స్ నిర్వాహకులు బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం అతడు తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాడని తెలిపారు. అతడు పనిచేసిన ప్రాంతాన్ని శానిటైజ్ చేశామని చెప్పారు. అంతేకాక అతడితో కలిసి పనిచేసిన వాళ్లను కూడా వారి ఇళ్లలోనే ఉండాలని ఆదేశించామని పేర్కొన్నారు. నిర్వహణ కమిటీలో 3500 మంది ఉద్యోగులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా వారిలో 90 శాతం మంది తమ ఇళ్ల వద్ద నుంచే పనిచేస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ 2021 జులై 23-ఆగస్టు 8 తేదీలకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వచ్చే సంవత్సరం కూడా ఈ మెగా ఈవెంట్ జరిగే అవకాశాలు కనిపించడం లేదని జపాన్ వైరస్ నిపుణులు చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వస్తే తప్ప ఒలింపిక్స్ నిర్వహించడం సాధ్యం కాదని అన్నారు. షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సింది.