నేడు ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్

* 35 ఏండ్ల మెస్సీ కల నెరవేరుతుందా లేక 23 ఏండ్ల ఎంబాపే నయా సాకర్‌ సూపర్‌ స్టార్‌గా అవతరిస్తాడా అనేది తేలనుంది.

Update: 2022-12-18 02:16 GMT

నేడు ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్

Football Finale: నెల రోజులుగా క్రీడాభిమానులను గోల్స్‌ గోలలో ముంచెత్తిన ఫిఫా ప్రపంచకప్‌ తుది అంకానికి చేరుకుంది. స్థాయికి తగ్గ ఆటతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ ఫైనల్‌కు దూసుకొస్తే స్టార్‌ స్రయికర్‌ లియోనెల్‌ మెస్సీ అసమాన ప్రతిభతో అర్జెంటీనా ఆఖరి ఆటకు రెడీ అయింది. కప్పు కొట్టి ఫుట్‌బాల్‌ మాంత్రికుడు డిగో మారడోనాకు ఘనమైన నివాళి అర్పించాలని అర్జెంటీనా తహతహలాడుతుంటే ఆరు దశాబ్దాల్లో టైటిల్‌ నిలబెట్టుకున్న తొలి జట్టుగా చరిత్రకెక్కాలని ఫ్రాన్స్‌ భావిస్తోంది.

క్రీడాలోకం యావత్తు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సాకర్‌ తుది సమరానికి వేళైంది. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఇవాళ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోనుంది. ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకున్న అర్జెంటీనా వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్న ఫ్రాన్స్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా తుదిపోరుకు చేరుకుంది.

ఆరేండ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలకాలనుకున్న అర్జెంటీనా లెజెండ్‌ లియోనెల్‌ మెస్సీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని ఇప్పటికే ప్రకటించగా తమ స్టార్‌ కోసం కప్పు నెగ్గాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఉత్తుంగతరంగంలా ఎదుగుతున్న కిలియన్‌ ఎంబాపే ఫ్రాన్స్‌కు వరుసగా రెండో టైటిల్‌ అందించాలని పట్టుదలతో ఉన్నాడు. మరి 35 ఏండ్ల మెస్సీ కల నెరవేరుతుందా లేక 23 ఏండ్ల ఎంబాపే నయా సాకర్‌ సూపర్‌ స్టార్‌గా అవతరిస్తాడా అనేది తేలనుంది. 19 ఏండ్ల వయసులోనే గత ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఎంబాపేపై భారీ అంచనాలు నెలకొనగా అతడిని అడ్డుకుంటేనే అర్జెంటీనా ముందడుగు వేయగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News