WTC Final: WTC ఫైనల్‌లో నేడు ఐదో రోజు ఆట

WTC Final: గెలుపునకు 280 పరుగుల దూరంలో భారత్‌

Update: 2023-06-11 03:30 GMT

WTC Final: WTC ఫైనల్‌లో నేడు ఐదో రోజు ఆట

WTC Final: దశాబ్ద కాలంగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకునేందుకు టీమ్‌ఇండియా పోరాడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో 444 పరుగుల ప్రపంచ రికార్డు చేజింగ్‌లో భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 164తో నిలిచింది. భారత విజయానికి చివరి రోజు 90 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆస్ట్రేలియా 7 వికెట్ల దూరంలో ఉంది. ఇప్పటికే రోహిత్‌, గిల్‌, పుజారా పెవిలియన్‌ చేరిపోగా.. కోహ్లీ, రహానే పోరాడుతున్నారు. ఇవాళ తొలి సెషన్‌లో కంగారూ పేసర్లను ఈ జోడీ ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే ఈ మ్యాచ్‌ గమనం ఆధారపడి ఉంది.

చేజ్‌మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీపై టీమ్‌ఇండియా గంపెడు ఆశలు పెట్టుకుంది. టాప్‌-3 బ్యాటర్లు ఔటైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన విజయం సాధించాలంటే విరాట్‌ తనలోని పోరాట యోధుడిని తట్టిలేపాల్సిన అవసరముంది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం ఉన్న రహానే అండతో కోహ్లీ మ్యాచ్‌ను భారత్‌ వశం చేయాలని శతకోటి అభిమానులు ఆశిస్తున్నారు. నాలుగోరోజు సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన ఈ జోడీ.. అదే జోరు కొనసాగిస్తే.. లక్ష్య ఛేదన పెద్ద కష్టం కాదు. కానీ.. పోరాటానికి మారుపేరైన కంగారూలు అంత తేలికగా వదులుతారని అనుకోకూడదు.

రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ ఔటైన తీరు భారీ చర్చకు దారితీసింది. బోలాండ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ తొలి బంతికి గిల్‌ కొట్టిన షాట్‌ను కామెరూన్‌ గ్రీన్‌ ఎడమ చేత్తో అందుకున్నాడు. అయితే బాల్‌ నేలకు తాకినట్లు రిప్లేల్లో కనిపించినా.. థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో మైదానంలో ప్రేక్షకులు చీటర్స్‌, చీటర్స్‌ అనే నినాదాలు చేయడం వినిపించింది.

Tags:    

Similar News