2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీని ముందు వెళ్లమని చెప్పా : సచిన్
క్రికెట్ అభిమానులకి 2011 వన్డే ప్రపంచకప్ ఓ మధుర జ్ఞాపకం..
క్రికెట్ అభిమానులకి 2011 వన్డే ప్రపంచకప్ ఓ మధుర జ్ఞాపకం.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయం సాధించి భారత్ కి రెండో సారి ప్రపంచకప్ ని అందించింది. విరాట్ కోహ్లి (35) రూపంలో మూడో వికెట్ కోల్పోగా ఆ తర్వాత యువరాజ్ సింగ్ వస్తాడని అందరు అనుకున్నారు . కానీ అతని స్థానంలో ధోని (91: 79 బంతుల్లో 8x4, 2x6) వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రపంచకప్‌లో ధోనీ ఎక్కువగా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసాడు. ఫైనల్లో మాత్రం ఒక స్థానం ముందుకు వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో చివరివరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు ధోని . దీనితో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించింది.
అయితే ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందు రావాలని తాను కూడా సలహా ఇచ్చినట్లు భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ చెప్పుకొచ్చాడు. " అప్పటికే గంభీర్ బ్యాటింగ్ చక్కగా చేస్తున్నాడు. ఇక శ్రీలంక నుంచి అప్పటికే ఇద్దరు నాణ్యమైన ఆఫ్‌స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక కుడి-ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ అయితే బాగుంటుందని అనిపించింది. ఆ సమయంలో గంభీర్ ఉండడంతో ధోని వెళ్తే చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తాడనిపించింది. వీరూకు చెప్పి ఓవర్ విరామ సమయంలో ధోని దగ్గరికెళ్లి ఈ విషయం చెప్పి రమ్మన్నాను" అని సచిన్ వెల్లడించాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్‌ని ముగించింది..