Virat Kohli: సెలక్షన్ కి గంట ముందు నువ్వు వన్డే టీం కెప్టెన్ కాదని చెప్పారు
Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ స్పందించాడు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. సారధిగా తాను వందకు వందశాతం ఎఫర్ట్ పెట్టానని వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో టీ20 కెప్టెన్‌గా తప్పుకుంటానని బోర్డుకు చెప్పినప్పుడు బీసీసీఐ వద్దనలేదన్నాడు. వన్డేలకు, టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరిస్తానని చెప్పానన్న కోహ్లీ.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తామని ముందు చెప్పలేదన్నాడు. బహుశా ఐసీసీ టోర్నమెంట్స్ గెలవనందుకే తనను తప్పించి ఉండొచ్చని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
డిసెంబర్ 8న దక్షిణాఫ్రికాతో టెస్ట్ టీం సెలక్షన్ కి గంట ముందు అయిదుగురు సెలెక్టర్లు ఇక నేను వన్డే కెప్టెన్ కాదని చెప్పారని.. అందుకు "సరే మంచిది" అని సమాధానం ఇచ్చినట్లు విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. అంతేకాని అంతకు ముందు ఎప్పుడు సమాచారం ఇవ్వలేదని కోహ్లి అన్నాడు.
మరోవైపు టీ20, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ మంచి కెప్టెన్ అన్న కోహ్లీ.. రోహిత్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసని, అతడికి తన మద్దతు ఎన్నటికీ ఉంటుందన్నాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ ఆడుతానని విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు.